
Nadendla Manohar: ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ : నాదెండ్ల మనోహర్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారని తెలిపారు. జిల్లాల స్థాయిలో మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఇతర ప్రజాప్రతినిధులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఇచ్చే కార్డులపై ముఖ్యమంత్రి లేదా ఇతర నాయకుల ఫొటోలు ఉండబోవని స్పష్టం చేశారు. కార్డుల్లో కేవలం కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఫొటోలు మాత్రమే ఉండనున్నాయని వెల్లడించారు.
వివరాలు
కొత్త దరఖాస్తులపై చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం మొత్తం 16,08,612 దరఖాస్తులు అందాయని, వాటిలో 15,32,758 దరఖాస్తులను పరిష్కరించామని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో 9,87,644 కుటుంబాలకు నూతనంగా రేషన్ కార్డులు జారీచేయనున్నట్టు తెలిపారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల మొత్తం సంఖ్య 1,45,97,486కు పెరుగుతుందని చెప్పారు. ఈ కార్డులకు సంబంధించిన సభ్యుల సంఖ్య 4,29,79,897గా ఉందని వివరించారు. కొత్త కార్డులకు ఈ ఆగస్టు నుంచే రేషన్ సరఫరా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
వివరాలు
దీపం పథకం - నిధుల నేరుగా జమ ప్రక్రియ
దీపం పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 764 కోట్ల రూపాయల సబ్సిడీతో 97.59 లక్షల కుటుంబాలకు ఉచిత సిలిండర్లు అందజేశామని చెప్పారు. రెండో సిలిండర్‌ను ఇప్పటికే 93.46 లక్షల లబ్ధిదారులు పొందినట్లు తెలిపారు. వీరికి రాయితీగా 747 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. అయితే, ఇంకా గ్యాస్ కంపెనీల వద్ద 35 కోట్ల రూపాయల సబ్సిడీ పెండింగ్‌లో ఉందని చెప్పారు. 86 వేల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సాంకేతిక లోపాల వల్ల సొమ్ము జమ కాకపోవడం జరిగింది. వారిని సచివాలయ సిబ్బంది ద్వారా సమాచారంతో అవగాహన కలిగించి పరిష్కరిస్తామని తెలిపారు.
వివరాలు
ప్రముఖ బ్యాంకుతో పైలట్ ప్రాజెక్ట్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహకారంతో కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో డిజిటల్ వాలెట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీనిద్వారా రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో నేరుగా జమ చేస్తున్నారు. 4,281 మందిని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేయగా, 2,580 మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, అందులో 1,184 మంది వాడుకున్నట్లు మంత్రి తెలిపారు. వాలెట్‌లో జమ చేసిన డబ్బును కేవలం గ్యాస్ సిలిండర్ కొనుగోలుకు మాత్రమే వినియోగించవచ్చని, ఇతర అవసరాలకు వినియోగించలేరని స్పష్టం చేశారు. మూడో సిలిండర్ పంపిణీ సమయంలో ఈ పథకం అమలును సమగ్రంగా విశ్లేషిస్తామని, నాలుగో సిలిండర్ ఇచ్చే నాటికి ఈ విధానాన్ని మొత్తం రాష్ట్రానికి విస్తరించనున్నట్లు వివరించారు.
వివరాలు
పవన్ కల్యాణ్ సినిమా ప్రమోట్ చేయడం మా బాధ్యత
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రచారం చేయడం తమ బాధ్యతేనని మంత్రి మనోహర్ అన్నారు. ఇది చారిత్రక కల్పిత కథ ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రజలంతా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ చిత్ర ప్రచారంలో తప్పేం లేదని స్పష్టం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.