PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేయాలి.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) పోటీ చేయాలని పొలిటికల్ అఫైర్ కమిటీలో నిర్ణయించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పీఏసీ సమావేశాన్ని (PAC Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమాశం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం : షబ్బీర్ అలీ
ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ ఆలీ, వీహెచ్ హనుమంతరావు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. గతంలో మెదక్ నుంచి ఇందిరా గాంధీ పోటీ చేశారని, దీంతో తెలంగాణ నుంచి సోనియాను పోటీ చేయించాలని తీర్మానం చేసినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మిగతా గ్యారెంటీల పైన అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు.