Polavaram: ఏడేళ్ల తర్వాత పోలవరం బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ
ఈ వార్తాకథనం ఏంటి
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పోలవరం నిర్వాసితుల కల ఎట్టకేలకు నెరవేరింది.
ఏడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పునరావాసం ప్యాకేజీతో పాటు ఇతర నిధులు అందించినా తర్వాత జగన్ సర్కార్‌లో ఈ అంశంపై పెద్దగా చర్చ జరగలేదు.
తాజాగా కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీల కింద రూ.996.47 కోట్లను పోలవరం నిర్వాసితులకు విడుదల చేసింది.
ఇందులో పునరావాసం కోసం రూ.586.71 కోట్లు, భూ సేకరణకు రూ.235.23 కోట్లు, నిర్మాణ పనుల కోసం రూ.174.53 కోట్లు ఇవ్వనుంది.
ఈ మొత్తం రెండు రోజుల్లోనే నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. ఇందులో పునరావాస కాలనీల నిర్మాణ పనుల నిధులు కూడా ఉన్నాయి.
Details
5వేల కుటుంబాలకు లబ్ధి
పోలవరం ప్రాజెక్టు కారణంగా తొలిదశలో ముంపులో చిక్కుకునే గ్రామాల పునరావాసంపై ప్రభుత్వం మొదట దృష్టి సారించింది.
ఈ గ్రామాల్లో గిరిజనేతరుల పునరావాస ప్యాకేజీ కింద రూ,6.36 లక్షలు, గిరిజనులు, ఎస్సీలకు రూ.6.86 లక్షలు అందజేశారు.
భూములు ముంపులో చిక్కుకున్నవారికి పరిహారం చెల్లించి భూములను సేకరించారు. ఇంటి స్థలం, నిర్మాణం అవసరం లేదనుకున్న నిర్వాసితులకు రూ.3.85 లక్షలు చెల్లించారు.
తమకు స్థలం కావాలనీ, తామే ఇల్లు నిర్మించుకుంటామని తెలిపినవారికి రూ.2.85 లక్షలు అందించారు. అయితే పునరావాస కాలనీలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎంచుకున్నవారికి ఆ మొత్తాలు చెల్లించలేదు.
పునరావాస ప్యాకేజీ మొత్తం 5,000కు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరిందని సమాచారం.
Details
కేంద్రం నుంచి అదనపు నిధులు
తొలి దశలో పోలవరం ప్రాజెక్టు కారణంగా 20,946 కుటుంబాలను, రెండో దశలో 17,114 కుటుంబాలను పునరావాసం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వారిలో 7,480 కుటుంబాలు తమ సొంత ఇళ్లు నిర్మించుకుంటామని పేర్కొన్నాయి. పోలవరం ప్రాజెక్టు మిగిలిన పనుల కోసం కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేసింది.
ఇందులో అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు విడుదల చేశారు. తాజా విరాళంలో చెల్లించిన రూ. 996.47 కోట్లకు అదనంగా, మరో రూ.2,478 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం దాదాపు రూ.1,000 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయడంతో, మరిన్ని నిధుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే అవకాశముంది.