free gas cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్లకు విశేష స్పందన.. 5 రోజులలో.. 20.17 లక్షల బుకింగ్‌లు!
దీపావళి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల (దీపం-2) పథకానికి గొప్ప స్పందన వస్తోంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 1న ప్రారంభించారు. ఆప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20,17,110 మంది గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. అందులో 11,84,900 మందికి సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయి. వీరికి రూ.18 కోట్ల విలువైన సబ్సిడీ ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది.
పని ఒత్తిడితో డెలివరీ ప్రక్రియలో జాప్యం
సిలిండర్ బుక్ చేసిన వారికి 48 గంటల్లోపు డెలివరీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, రోజూ లక్షల సంఖ్యలో బుకింగ్‌లు అందుతుండటంతో గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. దీని ఫలితంగా సిలిండర్ల డెలివరీ ఆలస్యమవడంతో, లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.