
Marital Dispute: బెంగళూరులో మార్కెటింగ్ నిపుణుడు ఆత్మహత్య.. ఏడాదిగా భార్యతో ఎడబాటు
ఈ వార్తాకథనం ఏంటి
భార్యాభర్తల మధ్య జరిగిన వివాదాలు చివరకు వారిని విడిపోయేలా చేశాయి. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివసిస్తూ తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.
ఇప్పటికే సంవత్సరం గడిచినా, సమస్యలు పరిష్కారం కాలేదు. వారిద్దరి మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడలేదు.
అయితే భార్యతో ఈ విడిపోయిన పరిస్థితిని భర్త జీర్ణించుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి కలిగి, తీవ్రమైన మానసిక స్థబ్దతకు లోనయ్యాడు.
చివరికి ఆత్మహత్య అనే ఘోర నిర్ణయం తీసుకుని ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
వివరాలు
పూజాతో మళ్లీ కలసి ఉండాలనే కోరిక
వివరాల్లోకి వెళితే... ప్రశాంత్ నాయర్ (40) పూజా నాయర్ భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.
వారిద్దరి మధ్య విభేదాలు పెరిగిపోవడంతో, ఒక సంవత్సరం క్రితం విడిపోయారు.
ప్రస్తుతం ప్రశాంత్ నాయర్ ఓ టెక్నాలజీ కంపెనీలో మార్కెటింగ్ నిపుణుడిగా పనిచేస్తున్నారు.
పూజా నాయర్ కూడా ఒక మల్టీనేషనల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. వారు వేరుగా నివసిస్తూ ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రశాంత్ నాయర్ భార్య పూజాతో మళ్లీ కలసి ఉండాలనే కోరికను పలుమార్లు వ్యక్తం చేశారు. అయితే ఆమె అతడి విజ్ఞప్తిని పట్టించుకోకుండా తిరస్కరిస్తూ వచ్చింది.
దీంతో ఆమెతో మళ్లీ జీవితం సాగించలేనని తెలుసుకొని, తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యాడు. చివరికి తన నివాసంలోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాలు
పోలీసులు కేసు నమోదు
ఈ సంఘటనపై ప్రశాంత్ నాయర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుమారుడు ఫోన్ తీయకపోవడంతో అనుమానంతో అతడి ఇంటికి వెళ్లినప్పుడు, ఉరేసుకుని మరణించిన దృశ్యాన్ని చూశానని తెలిపారు.
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలే ఈ ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు.
అయితే తాను ఈ ఘటనలో ఎవ్వరిపైనూ అనుమానం వ్యక్తం చేయడంలేదని చెప్పారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.