Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే!
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలపై గురువారం ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ క్రమంలో లోక్ సభ ఎథిక్స్ కమిటీ అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలని మహువాను కోరింది. మహువా మెయిత్రాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు హోం, ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి సాయం తీసుకుంటుందని బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ తెలిపారు. సమావేశం అనంతరం 31న ప్యానెల్ ముందు హాజరు కావాలని ఎంపీని కోరినట్లు ఆయన తెలిపారు.
ఓంబిర్లాకు లేఖ రాసిన నిషికాంత్ దూబే
ఈకేసులో ప్రముఖ వ్యాపార వేత్త దర్శన్ హీరానందానీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేయడంతో మోయిత్రా ఈ కేసులో చిక్కుకుంది. ఆమెపై వచ్చిన ఆరోపణల్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. మహువా మోయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో పాటు న్యాయవాది జై అనంత్ దేవద్రాయ్ లను కమిటీ మూడు గంటల పాటు విచారించింది. తర్వాత సమన్లు జారీ చేసింది. ఈ విషయంపై ఇప్పటికే నిషికాంత్ దూబే పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఇదిలా ఉండగా, మోయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరేవారితో పంచుకుందని, ఆమె ఇండియాలో ఉన్న సమయంలో కూడా దుబాయ్ కేంద్రంగా లాగిన్ అయినట్లు ఆరోపించారు.