Sunkishala wall collapse: కుప్పకూలిన సుంకిశాల గోడ.. ఘటనపై సమగ్ర విచారణ: పొన్నం
సుంకిశాల ప్రాజెక్టు ప్రహరీ గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నల్గొండలో కృష్ణానదికి అడ్డంగా ఉన్న నాగార్జున సాగర్ డ్యాంకు చెందిన సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ ఆగస్టు 1న కూలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డెడ్ స్టోరేజీని బద్దలు కొట్టి సుంకిశాల పంప్ హౌస్‌పైకి నీరు రావడంతో షిఫ్ట్ మార్పు సమయంలో కుప్పకూలింది. సుంకిశాల ప్రాజెక్టును బీఆర్‌ఎస్ హయాంలోనే నిర్మించారని మంత్రి తెలిపారు. ప్రమాదంపై మున్సిపల్, హెచ్‌ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
బీఆర్ఎస్ వల్ల తెలంగాణ రైతులకు మేలు జరగలేదు :పొన్నం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై పొన్నం విమర్శలు చేస్తూ..''గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఆ పార్టీ లీడర్లు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారు. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని ఆయన అన్నారు. గురువారం భీమదేవరపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని గత ముఖ్యమంత్రి ఏనాడూ ఆలోచించలేదని అన్నారు.గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ వల్ల తెలంగాణ రైతులకు మేలు జరగకుండా అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం నిర్మించి తెలంగాణ ప్రజలకు నష్టం చేశారని అన్నారు. అసెంబ్లీలో సరైన సమాధానాలు చెప్పలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోయారన్నారు.దళితుడైన స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడేందుకు ఇష్టపడకపోవడంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు.