దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్
దీపావళి టాపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పటాకల వల్ల భారీగా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరిగి జనజీవనానికే ముప్పుగా పరిణమిస్తోంది. ఈ తరుణంలో దేశంలోనే వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న దిల్లీలో బాణాసంచా కాల్చడాన్ని దిల్లీ సర్కారు నిషేధించింది. దిల్లీలో బాణాసంచా విక్రయం, తయారీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, తయారీ దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దిల్లీ ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే గ్రీన్ క్రాకర్లపైనా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. బేరియంతో ఫైర్ క్రాకర్ల తయారీని, వాటి వినియోగాన్ని అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది.
ప్రజల ఆరోగ్యమే ముఖ్యం: సుప్రీంకోర్టు
భారతదేశంలో చాలా చోట్ల బేరియంతో కూడిన బాణసంచాపై నిషేధం ఉన్నట్లు సుప్రీంకోర్టు గుర్తుచేసింది. 2018లో విధించిన నిషేధాన్నే అధికార యంత్రాంగం విధిగా అమలు చేయాలని జస్టిస్ బోపన్న, జస్టిస్ సుందరేష్ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బేరియం క్రాకర్స్‌ను 2018లో దీపావళి సందర్భంగా నిషేధించారని, ఆ ఆదేశాలే ఇంకా కొనసాగుతున్నాయని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. అయితే దిల్లీ తప్ప మిగతా దేశమంతా గ్రీన్ కాకర్స్ కాల్చవచ్చని గతంలోనే సుప్రీం పేర్కొంది. ప్రజా ఆరోగ్యమే ముఖ్యమని చెప్పింది. ఈ క్రమంలోనే దిల్లీ సర్కారు నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. బాణాసంచా కాలుస్తున్న వారిపై కేసులు పెట్టొద్దని, తయారీదారులను బాధ్యులుగా చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.