
Supreme Court: సమాజానికి తీవ్ర ముప్పు.. చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీం ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఆరుగురు చిన్నారుల కేసును దిల్లీ పోలీసులు తక్షణమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
చిన్నారుల అక్రమ రవాణా అంశంపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది.
నవజాత శిశువులను లక్షల్లో విక్రయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
ఆ ఆరుగురు చిన్నారులను తప్పక కనుగొనండి. వారిని అమ్ముతున్న, కొంటున్న వారిని చట్టపరంగా శిక్షించండి. అలాంటి వ్యక్తులు సమాజానికి పెద్ద ముప్పు అని కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ పార్థివాలా మాట్లాడుతూ ఒక వ్యక్తి హత్య చేస్తే అది ఒక్కసారి జరిగే నేరం కావచ్చు.
Details
హంతకులకంటే ప్రమాదం
కానీ చిన్నారుల కిడ్నాప్, అమ్మకాలు చేసే వ్యక్తులు మళ్లీ మళ్లీ అదే నేరాన్ని చేస్తున్నారు. ఇలాంటి ముఠాలు సమాజానికి హంతకులకంటే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీలో నడుస్తున్న పిల్లల అక్రమ రవాణా రాకెట్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఒక్కో చిన్నారిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్న ముఠాల వ్యవస్థ గురించి వార్తలు వస్తున్నాయని కోర్టు పేర్కొంది.
ఈ చిన్నారులందరూ అపహరణకు గురైపోలేదని, కొంతమందిని తల్లిదండ్రులే విక్రయించారని పోలీసులు తెలిపారు.
Details
పిల్లల రక్షణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి
ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలను తిరిగి తీసుకోవాలనకపోతే, వారిని ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది.
ప్రతేడాది దాదాపు రెండు వేల చిన్నారుల అక్రమ రవాణా కేసులు నమోదవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పిల్లల రక్షణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం హితవు పలికింది.