Page Loader
Kommineni Srinivasa Rao: కొమ్మినేనికి బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
కొమ్మినేనికి బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..

Kommineni Srinivasa Rao: కొమ్మినేనికి బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ, తక్షణమే విడుదల చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన విడుదలకు సంబంధించిన నిబంధనలను ట్రయల్‌ కోర్టు పరిశీలించనుందని, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా, ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించేలా వ్యవహరించకూడదని హెచ్చరించింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.

వివరాలు 

అమరావతి రాజధాని పై అభ్యంతరకర వ్యాఖ్యలు 

కొమ్మినేని శ్రీనివాసరావు ఒక టీవీ ఛానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ చర్చలో పాల్గొన్న జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి రాజధాని పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనను కలిగించాయి. దీనికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో కొన్నిరోజుల వ్యవధిలోనే అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు కృష్ణంరాజుపైనా, ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానల్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కొమ్మినేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.