LOADING...
ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు.. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సీబీఐ
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు

ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు.. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సీబీఐ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 25, 2023
06:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. 2007లో అక్రమంగా గనులు కేటాయించారని శ్రీ లక్ష్మీపై సిబిఐ కేసులు నమోదు చేసింది. అనంతపురం జిల్లాలోని ఓబులాపురం మైనింగ్‌ కంపెనీకి సంబంధించి సిబిఐ కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ఉన్నత న్యాయస్థానం శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేస్తూ గతేడాది నవంబర్‌ 8న తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సిబిఐ తాజాగా సుప్రీంను ఆశ్రయించింది. దీంతో జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది.

DETAILS

శ్రీలక్ష్మి పేరును అభియోగాల నుంచి తొలగించిన హైకోర్టు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. దీంతో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ వాదిస్తోంది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి అక్రమంగా గనులు కేటాయించారని కేసులు కూడా నమోదు చేసింది. ఓఎంసీ కేసులో తనను డిశ్ఛార్జ్ చేయాలన్న పిటిషన్‌ను అక్టోబర్ 17న సీబీఐ కోర్టు కొట్టేసింది. దీంతో శ్రీలక్ష్మి హైకోర్టులో సవాలు చేశారు. మరోవైపు శ్రీలక్ష్మిపై ఐపీసీ 120బి రెడ్‌ విత్‌ 409, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌ 13(1)(డి) కింద అభియోగాలను మోపేందుకు సరైన కారణాలు లేవని హైకోర్టు చెప్పింది. ఈ మేరకు ఆమె పేరును అభియోగాల నుంచి తొలగిస్తున్నామని స్పష్టం చేసింది.