Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఔషధాల ధరలు పెరిగాయి: సుప్రీం కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
అందుబాటు ధరల్లో వైద్య సేవలు మరియు సదుపాయాలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రైవేటు ఆస్పత్రులకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని వ్యాఖ్యానించింది.
ప్రైవేటు ఆస్పత్రులు రోగులు,వారి కుటుంబ సభ్యులను అధిక ధరల మందులు కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో ఇటీవల విచారణ జరిగింది.
రోగులు తమ అవసరమైన ఔషధాలను తప్పనిసరిగా ఆసుపత్రుల ఫార్మసీల నుంచే కొనుగోలు చేయాలని బలవంతం చేయకుండా, ప్రైవేటు ఆసుపత్రులకు తగిన సూచనలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని, దీని ప్రభావంగా రోగులు ఆర్థిక దోపిడికి గురవుతున్నారని అభిప్రాయపడింది.
వివరాలు
మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం
రోగులకు సూచించిన ఔషధాలు ఇతర ఫార్మసీలలో తక్కువ ధరకు లభిస్తే, ఆసుపత్రుల ఫార్మసీల నుంచే కొనుగోలు చేయాలని బలవంతం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు స్పష్టమైన సూచనలు ఇచ్చింది.
ముఖ్యంగా పేద ప్రజలకు ప్రాణాపాయ ఔషధాలు అందుబాటు ధరల్లో లభించడం మరింత కష్టతరమైందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
పౌరులను ఇలాంటి దోపిడీ నుంచి రక్షించేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.