సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1 పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. జీఓ నంబర్ 1పై జనవరి 23న విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. కందుకూరు, గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి.. పలువురు మృతి చెందారు. కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. జీఓ నెం.1ను తీసుకొచ్చింది. ఈ జీవోను హైకోర్టు వెకేషన్ బెంచ్ సస్పెండ్ చేసింది. వెకేషన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ చేసే అధికారం వెకేషన్ బెంచ్‌కు లేదు: ప్రభుత్వం తరఫు న్యాయవాది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వైద్యనాథన్ తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారణ చేసే అధికారం వెకేషన్ బెంచ్‌కు లేదని ఆయన ధర్మాసనానికి తెలిపారు. వెకేషన్ బెంచ్ తనకు లేని పరిధిలో తీర్పునిచ్చిందని వాదించారు. ఉదయం 10:30 గంటలకు కేసు విచారణకు వస్తే, ప్రతివాదుల వాదనలు వినకుండానే అదే రోజు వెకేషన్ బెంచ్ తీర్పును ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వాదనను నమోదు చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్.. తాము కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదన్నారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేనని చెప్పారు. ఈనెల 23వ తేదీన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించాలని ఆదేశించారు.