Supreme Court: రూ.2,700 మందు రూ.27 వేలా? క్యాన్సర్ ఔషధాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
క్యాన్సర్ ఔషధాల ధరలను భారీగా పెంచి విక్రయించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రిటైలర్లకు తక్కువ ధరకే సరఫరా అవుతున్న మందులపై భారీ ఎంఆర్‌పీ ముద్రించి విక్రయించడం సరికాదని స్పష్టం చేసింది. ఔషధాల ధరల నియంత్రణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రిటైలర్లకు రూ.2,700కే సరఫరా అవుతున్న ఓ క్యాన్సర్ ఔషధంపై రూ.27 వేల ఎంఆర్‌పీ ముద్రించడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఇలా మందుల ధరలను ఏకంగా పది రెట్లు పెంచి విక్రయించడం అరాచకమని వ్యాఖ్యానించింది. అన్ని రకాల మందులపై ఒకే విధంగా 16 శాతం మార్జిన్ ఉండేలా చూడాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు
అదే సమయంలో ఆస్పత్రులు తమకు చెందిన మెడికల్ షాపుల నుంచే రోగులు మందులు కొనుగోలు చేయాలంటూ నిబంధనలు విధించే అంశంపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
ఇటువంటి విధానాల వల్ల చివరికి ఆర్థిక భారం సామాన్య రోగులపైనే పడుతోందని ధర్మాసనం పేర్కొంది.