
Krishna Water: 'కృష్ణా ప్రాజెక్టుల'పై ఏపీ ప్రభుత్వం రిట్‌పిటిషన్ దాఖలు..స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మితమైన ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (KRMB) అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను, అలాగే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34ను సస్పెండ్ చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లను స్టే చేయాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది.
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
స్టే ఇచ్చే పరిస్థితి లేదని ధర్మాసనం స్పష్టంచేసింది.
వివరాలు
స్టే ఇవ్వాలన్న అంశమే ఎక్కడి నుంచి వస్తుంది
"మీ పిటిషన్‌ను ఆమోదించి స్టే ఇస్తే, దానిలోని విషయాలను ముందుగానే సమర్థించినట్టవుతుంది. తుది తీర్పు ఇచ్చినట్టవుతుంది. ప్రస్తుతం అలా చేయలేం. మూడు సంవత్సరాల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్లు ఇప్పటికీ అమల్లోకి రాకపోతే, వాటిపై స్టే అవసరం ఏమిటి?" అని జస్టిస్ ఓకా వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో, న్యాయవాది వైద్యనాథన్ కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించిన నేపథ్యాన్ని ధర్మాసనానికి వివరించారు.
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించిన విషయం ఇంకా తుదినిర్ణయం పొందలేదని ఆయన చెప్పారు.
"అది ఇంకా పెండింగ్‌లో ఉన్న స్థితిలో స్టే ఇవ్వాలన్న అంశమే ఎక్కడి నుంచి వస్తుంది?" అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.
వివరాలు
స్టే ఇస్తే రెండు రాష్ట్రాలకు సమస్యలు
అలాగే, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరిగే పరిస్థితి లేకపోతే, బోర్డు వాటిని పంచే బాధ్యత ఎలా తీసుకుంటుంది? అని న్యాయవాది వివరించారు.
స్టే ఇస్తే రెండు రాష్ట్రాలకు సమస్యలు తలెత్తుతాయని, ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
వైద్యనాథన్ స్పందిస్తూ, ఈ కేసులను పూర్తి స్థాయిలో విచారించేందుకు వాయిదా వేయాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ, 2021 జులై 15, 2022 ఏప్రిల్ 1న జారీ చేసిన నోటిఫికేషన్లు ఇప్పటివరకు అమల్లోకి రాలేదని చెప్పారు.
అయితే ఏపీ న్యాయవాది వాటిని అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు.
దీంతో, నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తిని విచారణకు తీసుకోవాలన్న అంశాన్ని వాయిదా వేస్తామని ధర్మాసనం తెలిపింది.
వివరాలు
జీవో 34ను సస్పెండ్ తదుపరి విచారణకు వాయిదా
కృష్ణా నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34పై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదించారు.
దీనిపై జస్టిస్ ఓకా స్పందిస్తూ, "నోటిఫికేషన్లపై స్టే ఇవ్వబోమన్నాం కాబట్టి, అదే మీ అవసరాలను తీరుస్తుంది" అని అన్నారు.
ఈ నేపథ్యంలో, జీవో 34ను సస్పెండ్ చేయాలన్న అంశాన్ని కూడా తదుపరి విచారణకు వాయిదా వేయాలని ఏపీ న్యాయవాది కోరారు.
దీనికి జస్టిస్ ఓకా అంగీకరించి, సంబంధిత ఉత్తర్వులను జారీ చేశారు.