Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా, సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్‌ను కస్టడీలో ఉన్నప్పుడు సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో మళ్లీ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనేక వాయిదాల తరువాత నేడు విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు.
ఈ నెల 10వ తేదీన తీర్పు
కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన కారణాలు అస్పష్టంగా ఉన్నాయని, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ప్రస్తావనే లేదని వాదించారు ఆయన తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఎలా అరెస్ట్ చేస్తారని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉండగా, మీ ఇష్టానుసారం ఎలా నిర్ణయం తీసుకుంటారని కోర్టు నిలదీసింది. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10వ తేదీన తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది.