ED arrests: ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. పిఎంఎల్‌ఎ కింద ఈడి నిందితులను అరెస్టు చేయొద్దు : సుప్రీం కీలక తీర్పు
దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)నిరంతరం తన చర్యలను కొనసాగిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)చేస్తున్న అరెస్టులకు సంబంధించి గురువారం(మే 16)సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన అనంతరం ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది. మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న మెటీరియల్ ఆధారంగా ఓ వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని దర్యాప్తు సంస్థ విశ్వసిస్తే అప్పుడు సెక్షన్ 19 కింద నిందితుడిని అరెస్టు చేసే అధికారం ఉంటుంది. అయితే, అరెస్టుకు గల కారణాలను ఈడీ సదరు వ్యక్తికి వీలైంతన త్వరగా తెలియజేయాల్సి ఉంటుంది.
బెయిల్ సమయంలో PMLA షరతులు వర్తించవు
గురువారం (మే 16) విచారణ సందర్భంగా, ఎవరైనా నిందితుడిని ఈడి అరెస్టు చేయకపోతే, ఆ నిందితుడికి బెయిల్ సమయంలో పిఎంఎల్‌ఎ షరతులు ఏ విధంగానూ విధించబడవని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా, అటువంటి నిందితులకు సెక్షన్ 45 కింద బెయిల్ ,డబుల్ షరతులు వర్తించవని.. వారికి బెయిల్ లభిస్తుందని కోర్టు చెప్పింది. ఒకవేళ తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని ఈడీ కస్టడీకి తీసుకోవాలనుకుంటే.. అప్పుడు దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతుంది. ఈడీ చెప్పిన కారణాలతో కోర్టు సంతృప్తి చెందితేనే కస్టోడియల్ విచారణకు అనుమతినిస్తుందని అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.