
Supreme Court: 14 ఏళ్ల మైనర్ కి సుప్రీంకోర్టులో ఉపశమనం.. సుప్రీం అసాధారణ తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల మైనర్ గర్భాన్ని తొలగించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
సీజేఐ డివై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వుల సందర్భంగా.. గర్భం దాల్చితే ప్రాణాపాయం ఉంటుందని మెడికల్ బోర్డు నివేదిక పేర్కొంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు ఆదేశాలను కోర్టు రద్దు చేసింది.
14 ఏళ్ల మైనర్ గర్భాన్ని రద్దు చేసేందుకు ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టు విస్తృత అధికారాలను ఉపయోగించుకుని తీర్పు వెలువరించింది.
లైంగిక వేధింపుల తర్వాత గర్భవతి అయిన మైనర్ ప్రస్తుతం 30 వారాల గర్భిణి.
Details
గర్భవిచ్ఛిత్తికి నిరాకరించిన బాంబే హైకోర్టు
మహారాష్ట్రకు చెందిన 14ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లి, బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయంపై విచారణ జరిపిన న్యాయస్థానం గర్భవిచ్ఛిత్తికి నిరాకరించింది.
దీంతో,మైనర్ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈమేరకు శుక్రవారం సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది.
ఆ తర్వాత 14 ఏళ్ల మైనర్ అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మెడికల్ బోర్డు న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక ప్రకారం''ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తి చేస్తే కొంత ప్రమాదం ఉన్నప్పటికీ..కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదు.
ఈ గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలికపై శారీరకంగా,మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది'' అని ఆ నివేదికలో పేర్కొంది.
సుప్రీం కోర్టు
సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో ఏం చెప్పింది?
సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మైనర్ గర్భాన్ని రద్దు చేయాలని ఆదేశించింది.
ప్రెగ్నెన్సీ ఎంటీపీని అనుమతించాలని సియోన్ హాస్పిటల్ మెడికల్ బోర్డ్ అభిప్రాయపడిందని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాలతో ఈ తీర్పు వెలువరిస్తున్నట్లు తెలిపింది.
ఆ బాలికకు తక్షణమే వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేయాలని సియాన్ ఆసుపత్రి డీన్ ఆదేశించింది.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారు,అత్యాచారా బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది.
ఆ సమయం దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.