Loading...
SC:సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

SC:సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై దాఖలైన పిటిషన్‌ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) గ్యానేశ్‌కుమార్‌.. ఇతర ఎన్నికల కమిషనర్ల భాగస్వామ్యం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో ఈ పిటిషన్‌ దాఖలైంది. దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)ను కూడా పిటిషన్‌లో సవాల్‌ చేశారు.

వివరాలు 

సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది వాదనలు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

పిటిషనర్‌ రాకేష్‌ కుమార్‌ సింగ్‌ తరఫున ఆయన వాదనలు వినిపించారు.

ఎన్నికల సంఘం బహుళ సభ్యుల వ్యవస్థ అయినందున.. దాని నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ అభిప్రాయంతో ఉండాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాల విషయంలో మొత్తం కమిషన్‌ అభిప్రాయం ఉందా? అనే అంశంపై తీవ్ర రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని వికాస్‌ సింగ్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆయన కోరగా.. వచ్చే వారం కేసును జాబితాలో చేర్చాలని సీజేఐ ఆదేశించారు.

వివరాలు 

పిటిషన్‌లో ప్రధాన ఆరోపణలు

సామాజిక కార్యకర్త రాకేష్‌ కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్నికల సంఘం నిర్ణయ ప్రక్రియపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.

'ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'లో ఇటీవల ప్రచురితమైన పరిశోధనాత్మక కథనాన్ని కూడా పిటిషన్‌ ప్రస్తావించింది.

దాని ప్రకారం.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ,వివేక్‌ జోషి గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల జాబితాలకు సంబంధించిన నిర్ణయాలు,ఆదేశాలపై అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఇందులో నాలుగు అభ్యంతరాలు ఒకే రోజు నమోదైనట్లు కథనం పేర్కొంది. ఓటర్ల నమోదు,పేర్ల తొలగింపు,తొలగించిన పేర్ల పునరుద్ధరణ,ఓటరు నమోదుకు ఉపయోగించే ఫామ్‌-6లో మార్పులు, ఓటర్ల డేటాబేస్‌ నిర్వహణ వంటి అంశాలు ఈ అభ్యంతరాల్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఎస్‌ఐటీ దర్యాప్తునకు పిటిషనర్‌ డిమాండ్

అయితే ఈసీఐ మాత్రం ఎస్‌ఐఆర్‌తో పాటు అన్ని కీలక నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగా తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అసలు రికార్డులు, ఫైళ్లు, నోటింగ్స్‌, ఇతర సంబంధిత పత్రాలను కోర్టు ముందుకు తీసుకురావాలని పిటిషనర్‌ కోరారు.

ప్రాథమిక పరిశీలనలో ఆరోపణలకు ఆధారం ఉందని తేలితే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర విచారణ కమిషన్‌ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్‌ఐఆర్‌ కింద ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న మార్పులు, ఈసీఐనెట్‌, ఈఆర్‌ఓనెట్‌ వంటి వ్యవస్థలకు సంబంధించిన అంశాలను కూడా దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలని పిటిషన్‌ కోరింది.

ADVERTISEMENT

వివరాలు 

సీఈసీ పదవిపై కూడా పిటిషన్‌లో అభ్యర్థన

ఎస్‌ఐఆర్‌ కింద జరిగిన చర్యలకు సంబంధించి సుమారు 13 కోట్ల పేర్లు తొలగించబడిన పరిస్థితులపై సాంకేతిక, ఫోరెన్సిక్‌, పరిపాలనా స్థాయిలో సమగ్ర ఆడిట్‌ నిర్వహించాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు గ్యానేశ్‌కుమార్‌ను సీఈసీ బాధ్యతల నుంచి తప్పించాలని పిటిషనర్‌ కోరారు.

అంతేకాకుండా ఎన్నికల సంఘం రోజువారీ వ్యవహారాలను మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల భాగస్వామ్యంతో నిర్వహించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల సంఘం బహుళ సభ్యుల రాజ్యాంగ వ్యవస్థగా ఉన్నందున.. దానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఒక్క వ్యక్తి స్వతంత్రంగా వినియోగించలేరన్నది పిటిషన్‌ ప్రధాన వాదన.

వివరాలు 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ఏం చెబుతోంది?

ఆర్టికల్‌ 324(1) ప్రకారం ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ వంటి అధికారాలు వ్యక్తిగతంగా సీఈసీకి కాకుండా ఎన్నికల సంఘానికే సంక్రమిస్తాయని పిటిషన్‌ పేర్కొంది.

ఆర్టికల్‌ 324(2) ప్రకారం ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర ఎన్నికల కమిషనర్లు ఉంటారు.

ఆర్టికల్‌ 324(3) ప్రకారం సీఈసీ కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

అదేవిధంగా 2023లో తీసుకొచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాల చట్టంలోని సెక్షన్‌ 18ను కూడా పిటిషన్‌ ప్రస్తావించింది.

కమిషనర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే మెజారిటీ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పిటిషన్‌ వాదించింది.

వివరాలు 

ఒక్కరి నిర్ణయంతో ఎన్నికల జాబితాపై చర్యలు తీసుకోవచ్చా?

ఎన్నికల సంఘానికి బహుళ సభ్యుల వ్యవస్థగా సంక్రమించిన అధికారాలను ఒకే కార్యాలయం ఇతర సభ్యుల భాగస్వామ్యం లేకుండా వినియోగిస్తే.. ఓటర్ల జాబితాలో ఎవరి పేరు ఉండాలి, ఎవరి పేరు తొలగించాలి వంటి కీలక నిర్ణయాలు రాజ్యాంగబద్ధమైన సంస్థ ద్వారానే తీసుకున్నారా? అనే ప్రశ్న తలెత్తుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌తో పాటు దాని కింద తీసుకున్న నిర్ణయాలు,ఆదేశాలు,చర్యలను ప్రారంభం నుంచే చట్టబద్ధత లేనివిగా ప్రకటించాలని కూడా పిటిషనర్‌ కోరారు.

వివరాలు 

ఒక్కరి నిర్ణయంతో ఎన్నికల జాబితాపై చర్యలు తీసుకోవచ్చా?

అయితే రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నిబంధనలు-1960 ప్రకారం చట్టబద్ధంగా చేపట్టిన ఇతర ఓటర్ల జాబితా మార్పులకు ఈ అభ్యర్థన వర్తించదని పిటిషన్‌ స్పష్టం చేసింది.

ఈ ఆరోపణలపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. కాగా, ఈసీఐ మాత్రం ఎస్‌ఐఆర్‌ సహా తన నిర్ణయాలన్నీ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని ఇప్పటికే స్పష్టం చేసింది.

వచ్చే వారం సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశాలపై తదుపరి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT