Dy Chandrachud : మహిళా న్యాయమూర్తికి లైంగిక వేధింపులు..CJI డివై చంద్రచూడ్'కు లేఖ
భారతదేశంలో ఓ మహిళా న్యాయమూర్తి లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్'కు ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.దీంతో లేఖ సోషల్ మీడియాలో వైరల్'గా మారింది. స్పందించిన సుప్రీం సీజేఐ ఘటనపై వెంటనే నివేదికివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్'ప్రదేశ్‌లోని బాందా జిల్లాలోని మహిళా న్యాయమూర్తి,సీజేఐకి బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తానే ఇప్పుడు న్యాయం కోసం సుప్రీంవైపు చూస్తున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. రాత్రివేళ తనను ఒంటరిగా వచ్చి కలవమంటున్నారనిలేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
మరో చోటికి బదిలీ చేయాలని కోరితే పిటిషన్ తిరస్కరించారు
తనపై జరుగుతున్న వేధింపులపై ఈ ఏడాది జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యమన్నారు. కేసులో సాక్షులైన వారు తనను వేధింపులకు గురిచేస్తున్న జిల్లా న్యాయమూర్తి అనుచరులేనన్నారు. వారు తమ యజమానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారని తాను అనుకోనని చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయనను మరో చోటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే తన అభ్యర్థనను కొట్టివేశారని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఏడాదిన్నరగా జీవచ్ఛవంలా బతుకుతున్న తాను బతికి ఉండి ప్రయోజనం లేదని,ఈ మేరకు గౌరవప్రదంగా మరణించేందుకు అనుమతినివ్వాలని లేఖలో వేడుకున్నారు. దీనిపై తక్షణం నివేదిక అందివ్వాలని, విచారణకు సంబంధించిన మొత్తం వివరాలు సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.