వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన సూరజ్ తివారీ పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. లక్ష్యసాధనకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు, కుడి చేయి పూర్తిగా పోయినా, ఉన్న ఒక్క ఎడమ చేయికి రెండు వేళ్లు తొలగించినా అధైర్య పడలేదు. పట్టుదలతో చదవి రెండో ప్రయత్నంలో 917వ ర్యాంక్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. 2017లో ఘజియాబాద్‌లోని దాద్రీ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో సూరజ్ తివారీ రెండు కాళ్లతో పాటు కుడి చేయి,ఎడమ చేతి రెండు వేళ్లను కోల్పోయారు. దీంతో అతని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అదే సంవత్సరం ప్రారంభంలో తివారీ అన్నయ్య రాహుల్ చనిపోవడంతో ఆ కుటుంబం మరింత కుంగుబాటుకు గురైంది.
డిప్రెషన్‌లోకి వెళ్లిన సూరజ్ తివారి
అన్న చనిపోవడం, కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్ తివారి డిప్రెషన్‌లోకి వెళ్లారు. చివరికి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో తన డిగ్రీని కూడా ఆపేశారు. ఆరు నెలల తర్వాత తనను తాను దృఢంగా చేసుకొని మళ్లీ డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఈ సారి బీఏలో చేరారు. 2020లో అదే సబ్జెక్టులో మాస్టర్స్ కోసం నమోదు చేసుకున్నారు. కరోనా సమయంలో యూపీఎస్‌సీ పరీక్షకు సిద్ధమవడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన మొదటి ప్రయత్నంలోనే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కానీ ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్ల తేడాతో ఉద్యోగాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించి ఉద్యగాన్ని సంపాదించారు. సూరత్ తండ్రి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అతని తల్లి గృహిణి.
పట్టుదలతో చదవడం వల్లే విజయం సాధించా: సూరజ్
యూపీఎస్‌సీ పరీక్షలో ర్యాంకు సాధించడంపై సూరజ్ తివారి హర్షం వ్యక్తం చేశారు. పట్టుదలతో చదవడం వల్లే తాను విజయం సాధించినట్లు చెప్పారు. ప్రతిరోజూ 15-16 గంటల పాటు చదువుకోకుండా, కొన్ని గంటలపాటు ఏకాగ్రతతో చదివితే విజయం సాధించవచ్చని ఆయన అన్నారు. సూరజ్ తివారీ చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్ కాదని అతని తండ్రి చెప్పారు. సూరజ్ తివారీ ఇంటర్‌లో ఫెయిల్ ఫెయిల్ అయినట్లు గుర్తు చేశారు. తన కొడుకు చాలా కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరకు విజయం సాధించాడని తాను నమ్మలేకపోతున్నానని తివారి తండ్రి చెప్పుకొచ్చారు.