
NIA: ముంబయి దాడుల రెక్కీ సమయంలో హెడ్లీతో టచ్‌లో ఉన్న తహవూర్ రాణా : ఎన్‌ఏఐ
ఈ వార్తాకథనం ఏంటి
2008 ముంబయి ఉగ్రదాడి (Mumbai Terror Attacks) కేసులో కీలకంగా భావించబడుతున్న కుట్రదారుడు తహవూర్ హుసైన్ రాణా (Tahawwur Rana)ను అమెరికా అధికారులు భారతదేశానికి అప్పగించారు.
అతడిని ఇప్పటికే ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలో, ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమీకరించిన కీలక సమాచారాన్ని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
అందులో పేర్కొనబడినదాని ప్రకారం.. దాడులకు ముందు పాకిస్థాన్‌కు చెందిన అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ (David Headley,తహవూర్ రాణాతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించేవాడు.
వివరాలు
. 231 సార్లు మాట్లాడుకున్న రాణా, హెడ్లీ!
హెడ్లీ 26/11దాడికి ముందు మొత్తం ఎనిమిది సార్లు భారత్ పర్యటించినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో అతడు రాణాతో మొత్తం 231సార్లు మాట్లాడినట్లు ఎన్‌ఐఏ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని ఆ కథనం పేర్కొంది.
మొదటిసారి 2006 సెప్టెంబర్ 14న భారత్‌కు వచ్చిన హెడ్లీ,అప్పుడే రెక్కీ చేయడం ప్రారంభించాడని.. ఆ సమయంలో అతడు 32సార్లు రాణాతో టెలిఫోన్ లేదా ఇతర మార్గాల ద్వారా కమ్యూనికేషన్ చేశాడని సమాచారం.
హెడ్లీ భారత్‌కు వచ్చినప్పుడల్లా.. ఒకసారి 23,ఇంకోసారి 40,ఇంకొకసారి 66సార్లు ఇలా పలు దఫాలుగా రాణాతో మాట్లాడిన రికార్డులు ఉన్నట్లు పేర్కొనబడింది.
ఉగ్రదాడులకు తగిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడన్న అంశంపై ఎన్‌ఐఏ పత్రాల్లో స్పష్టమైన వివరాలు ఉన్నాయని ఆ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
వివరాలు
ప్రత్యేక విమానంలో భారత్‌కు..
అంతేకాదు, డేవిడ్ కోల్మన్ హెడ్లీతో తహవూర్ రాణాకు పరిచయం చాలా కాలం క్రితమే ఏర్పడిందని వివరాలు చెబుతున్నాయి.
సుమారు 15 సంవత్సరాల క్రితం రాణా తన ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో హెడ్లీతో పరిచయం ఏర్పడింది.
ముంబయి ఉగ్రదాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ను రూపొందించే పనిలో రాణా పాత్ర ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
ఇక తహవూర్ రాణా అమెరికాలో చట్టపరమైన అన్ని అవకాశాలను ఇప్పటికే వినియోగించుకున్నాడు. దాంతో, అక్కడి న్యాయ వ్యవస్థ ఆయన భారత్‌కు అప్పగింపునకు మంజూరు చేసింది.
ప్రస్తుతం భారత అధికారులు అతడిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
ఈ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని పలు ఆంగ్ల మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.