దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈక్రమంలో తాను కొత్తగా ప్రారంభించిన పాడ్‌కాస్ట్ 'స్పీకింగ్ ఫర్ ఇండియా' ప్రారంభ ఎపిసోడ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ హయాంలో దేశం సర్వ నాశనమైందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. భారతదేశం మొత్తం మణిపూర్, హర్యాణాగా మారకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి తప్పక గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం: స్టాలిన్
భారతదేశ ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. అంతేకాకుండా, బీజేపీ చెబుతున్న నరేంద్ర మోదీ నమూనాకు రోజులు దగ్గరపడ్డాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని గుజరాత్ మోడల్ అని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినట్లు స్టాలిన్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ మోడల్ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదని, దీంతో ఇప్పుడు అది చుక్కాని లేని మోడల్‌గా మారిందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. భారతీయులు చాలా కాలంగా ఆదరిస్తున్న ఐక్యతా భావాన్ని నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని చెప్పారు. దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు.
మతాన్ని ఆయుధంగా చేసుకున్న బీజేపీ: స్టాలిన్
బీజేపీ తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఆయుధంగా వాడుతోందని స్టాలిన్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. దేశంలో మత హింస, విద్వేశాలకు 2002 గుజరాత్ అల్లర్ల రూపంలో బీజాలు పడ్డాయని స్టాలిన్ అన్నారు. 2023లో, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో చెలరేగిన మతవాద మంటలు రాష్ట్రాన్ని కాల్చివేసాయన్నారు. ఆ తర్వాత హర్యానాలో కూడా మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. మత విద్వేషాలకు, బీజేపీకి ముగింపు పలకకపోతే దేశాన్ని, భారతీయులను ఎవరూ రక్షించలేరని స్పష్టం చేశారు. భారత సమాఖ్యవాదం, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడల్లా డీఎంకే అగ్రభాగాన ఉంటూ పారాడుతుందని స్టాలిన్ పేర్కొన్నారు.