తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం
తమిళనాడులో మరోసారి 'హిందీ' వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ 'ఆవిన్' తమ ప్యాకెట్లపై పెరుగుకు సమానమైన హిందీ పదమైన 'దహీ'ని ముద్రించడంపై రగడ రాజుకుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాల ప్రకారమే తాము హిందీ పేరును ముద్రించామని చెప్పడంతో ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పందించడంతో ఇది కేంద్రం ప్రభుత్వం వర్సెస్ దక్షిణాది రాష్ట్రాలు అన్న స్థాయిలోకి వెళ్లిపోయింది. పెరుగు పేరును హిందీలో ముద్రించడం అంటే బలవంతంగా భాషను రుద్దడమే అవుతుందని స్టాలిన్ ట్వీట్ చేశారు. తమిళంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుకు సమానమైన పదాలు ఉన్నాయని వాటిని వాడాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
వెనక్కి తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ; ప్రాంతీయ భాషల్లోనే పెరుగు పేరు
అలాగే తమిళనాడుతో పాటు, దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక సహకార సంస్థలు, ప్రైవేట్ డెయిరీలకు ప్యాకేజింగ్‌లో 'దహీ' పదాన్ని మార్చాలని కోరుతూ లేఖలు రాశాయి. అయితే ఈ వ్యవహారంపై గురువారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. పెరుగు ప్యాకెట్ల ముద్రిత లేబుల్‌లలో ప్రాంతీయ పేర్లను ఉపయోగించడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతించింది. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ఇప్పుడు లేబుల్‌పై బ్రాకెట్‌లలో ఏదైనా ఇతర ప్రబలంగా ఉన్న ప్రాంతీయ సాధారణ పేరుతో పాటు 'కర్డ్' అనే పదాన్ని ఉపయోగించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి ఇచ్చింది. అంటే కర్డ్(దహి), కర్డ్( మోసారు), కర్డ్(జాముత్దౌద్), కర్డ్ (తైర్), కర్డ్(పెరుగు) పదాలను ఉపయోగించవచ్చు.