Page Loader
Araku Coffee: అరకు నుంచి ఆర్గానిక్‌ కాఫీ.. జీసీసీ నుంచి కొనుగోలుకు టాటా గ్రూప్‌ ఆసక్తి
అరకు నుంచి ఆర్గానిక్‌ కాఫీ.. జీసీసీ నుంచి కొనుగోలుకు టాటా గ్రూప్‌ ఆసక్తి

Araku Coffee: అరకు నుంచి ఆర్గానిక్‌ కాఫీ.. జీసీసీ నుంచి కొనుగోలుకు టాటా గ్రూప్‌ ఆసక్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అరకు కాఫీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.తాజాగా, మన్యం ప్రాంతం నుండి తొలిసారిగా ఆర్గానిక్‌ కాఫీ పంట మార్కెట్లోకి ప్రవేశించింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో సాగుచేసి, సేకరించిన ఈ కాఫీ గింజలను టాటా గ్రూప్‌ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. వ్యవసాయ, ఉద్యాన పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం చాలా కాలంగా కొనసాగుతున్నా, కాఫీ తోటలను పూర్తిగా ఈ విధానంలో అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. దాదాపు పదేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర కాఫీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా, జీసీసీ ఆర్గానిక్‌ కాఫీ సాగును ప్రోత్సహించింది.

వివరాలు 

కాఫీ వ్యాపారంలో టాటా గ్రూప్‌ కీలక పాత్ర

నాలుగు సంవత్సరాల క్రితం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో 2,600 ఎకరాల కాఫీ తోటల్లో నేషనల్‌ ప్రోగ్రాం ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌ స్టాండర్డ్స్‌ (NPOP) ప్రమాణాలకు అనుగుణంగా గిరిజనులతో శాస్త్రీయ పద్ధతిలో సాగు ప్రారంభించారు. వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA) ధృవీకరించిన ఏజెన్సీల ద్వారా మూడేళ్ల పాటు వరుసగా తనిఖీలు నిర్వహించి, ఈ ఏడాదికి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ పొందగలిగారు. దీనికై జీసీసీ దాదాపు రూ. 70 లక్షల వరకు ఖర్చు చేసింది. టాటా గ్రూప్‌ ఇప్పటికే కాఫీ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే ఆర్గానిక్‌ కాఫీని మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల 

ఈ నేపథ్యంలో, జీసీసీ అధికారులతో సంప్రదింపులు జరిపిన టాటా గ్రూప్‌, ఏజెన్సీ ప్రాంత రైతులు ఉత్పత్తి చేసిన పంటను పరిశీలించి, కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. తొలి విడతగా 10,000 కిలోల కాఫీ గింజలను కొనుగోలు చేయడానికి జీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ దిగుబడులు తగ్గడంతో, దేశీయంగా మన్యం కాఫీకి డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది కాఫీ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. సేంద్రియ కాఫీకి సాధారణ కాఫీ కంటే ఎక్కువ ధర లభిస్తోంది.

వివరాలు 

ఆర్గానిక్‌ కాఫీ సాగుకు మొగ్గు

సాధారణ పార్చిమెంటు కాఫీ కేజీకి రూ. 400 లభిస్తే, ఆర్గానిక్‌ పార్చిమెంటు కేజీకి రూ. 450 వరకు ధర పలికింది. చెర్రి కాఫీ కేజీ రూ. 250 ఉండగా, సేంద్రియ విధానంలో పండించిన చెర్రి కాఫీ కేజీకి రూ. 330 వరకు లభిస్తోంది. ఈ తేడా కారణంగా (రూ. 50 - రూ. 80 అధిక ధర), మరింత మంది రైతులు ఆర్గానిక్‌ కాఫీ సాగుకు మొగ్గు చూపుతున్నారు అని జీసీసీ ఎండీ కల్పనాకుమారి తెలిపారు.