LOADING...
TCS layoffs: AI ప్రభావంపై సర్వే.. నెలలో పూర్తి చేస్తామని కర్ణాటక మంత్రి ప్రకటన 
AI ప్రభావంపై సర్వే.. నెలలో పూర్తి చేస్తామని కర్ణాటక మంత్రి ప్రకటన

TCS layoffs: AI ప్రభావంపై సర్వే.. నెలలో పూర్తి చేస్తామని కర్ణాటక మంత్రి ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

TCS సంస్థ 12,000 ఉద్యోగాలను తొలగించనున్న నేపథ్యంలో,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ విభాగంపై ఎలా ప్రభావం చూపిస్తోందో తెలుసుకునేందుకు సర్వే చేపట్టింది. ఈ సర్వేను నెల రోజుల్లోపు పూర్తి చేస్తామని మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా టెక్ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వేళ TCS నిర్ణయం మరోసారి షాక్ ఇచ్చినట్లైంది. TCSపై చర్యలు తీసుకోవాలని కోరిన కర్ణాటక IT/ITeS ఉద్యోగుల యూనియన్ అభ్యర్థనపై స్పందించిన ఖర్గే,"రాష్ట్రం IT రంగంలో యూనియన్లను అధికారికంగా గుర్తించదు. కానీ ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి ఎలాంటి ఆందోళనలు వస్తే, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మనదే" అని అన్నారు.

వివరాలు 

 ప్రక్రియ నెలరోజుల్లో పూర్తవుతుంది: ఖర్గే

బెంగళూరులోని SAP Labs India కార్యక్రమం సందర్భంగా PTIతో మాట్లాడిన ఖర్గే, "AI వల్ల ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవాలని కంపెనీలతో కలిసి సర్వే చేస్తున్నాం. మన హ్యూమన్ రిసోర్స్‌ ఎక్కువగా ఉద్యోగయోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో కంపెనీల అభిప్రాయాలు సేకరిస్తున్నాం" అన్నారు. ఈ ప్రక్రియ నెలరోజుల్లో పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. FY26 మొదటి త్రైమాసికంలో భారతదేశం టాప్‌ ఐటీ కంపెనీలు సింగిల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్‌ మాత్రమే నమోదు చేయడం, తీరా AI ప్రభావంపై చర్చను మరింత కీలకం చేసింది. ఈ మందకొడితనానికి కారణంగా క్లయింట్ల నిర్ణయాల్లో జాప్యం, ఆర్థిక అస్థిరతలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు 

TCS ఉద్యోగాల తొలగింపు - వ్యూహాత్మక నిర్ణయమే 

TCS చేపట్టిన ఉద్యోగాల తొలగింపు ఒక్కసారిగా జరిగిన నిర్ణయం కాదు. సంస్థ చెప్పినదాని ప్రకారం, ఇది సంస్థను భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా చేయడానికి తీసుకున్న వ్యూహాత్మక చర్య. కొత్త సాంకేతికతలలో పెట్టుబడి పెడుతూ, AI వంటివాటిని ఉపయోగించి వర్క్‌ఫోర్స్‌ను రియలైన్ చేస్తున్నామంటోంది. ఈ చర్య వల్ల గ్లోబల్‌గా దాదాపు 2% ఉద్యోగులపై, ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఇక సంస్థ MD, CEO కే. కృతివాసన్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల డిమాండ్‌ తక్కువగా ఉందని, FY26లో డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ఆశించట్లేదన్నారు. క్లయింట్ల నిర్ణయాల్లో జాప్యం పెరిగిందని, ఆర్థిక పరిస్థితి మెరుగైతే డిస్క్రిష్నరీ స్పెండింగ్ తిరిగి మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి 

భారతదేశంలో ఉన్న పరిస్థితి గ్లోబల్ టెక్ రంగానికి ప్రతిబింబమే. మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక్కటే ఈ ఏడాది 15,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. Layoffs.fyi అనే వెబ్‌సైట్‌ ప్రకారం, 2025లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 169 కంపెనీల్లో 80,000 మందికి పైగా టెక్ ఉద్యోగాలు కోల్పోయారు. 2024లో ఈ సంఖ్య 1.5 లక్షలకు చేరిన సంగతి తెలిసిందే. ఇదంతా గ్లోబల్ ఆర్థిక సమస్యలు, AI వల్ల ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న చర్చల ముప్పు మధ్యనే జరిగింది.