రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు
తెలంగాణలో మరో భారీ కార్యక్రమానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈనెల 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొననున్నారు. రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీ.. ఎన్టీఆర్ ఘాట్ వరకు సాగనుంది. ఈ ర్యాలీలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, నందమూరి సుహాసిని, పలువురు పార్టీ నేతలు పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సతీష్‌కుమార్ తెలిపారు.
ఈ నెలాఖరున నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్
తెలంగాణలో టీడీపీకి పుర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరింత ఫోకస్‌గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ర్యాలీ తర్వాత.. ఈ నెలాఖరున ఖమ్మం తరహాలో నిజామాబాద్‌లో మరో భారీ బహిరంస సభకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమచారం. ఈ సభకు కనీసం లక్ష మంది వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. త్వరలోనే ఈ బహిరంగ సభకు తేదీ ఖరారు చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.