జైల్లో చంద్రబాబును కలిసిన యనమల.. ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుంటానన్న టీడీపీ అధినేత
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో తమ అధినాయకుడ్ని కలిసిన తర్వాత పలు అంశాలు చర్చకు వచ్చాయని యనమల చెప్పారు.
15నిమిషాల పాటు జరిగిన భేటీలో జనసేనతో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చిందని, పార్టీ సమన్వయ కమిటీ నియామకం అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు.
టీడీపీ యువనేత లోకేశ్ దిల్లీ నుంచి రాగానే చర్చించి త్వరలోనే నియామకాలు చేపడదామన్నారు. తెలుగుదేశం - జనసేన శ్రేణులు కలిసే కార్యక్రమాలు చేస్తున్న తీరును బాబుకు వివరించామన్నారు.
తనను జైల్లో పెట్టి సీఎం వైఎస్ జగన్ తాత్కాలిక ఆనందం పొందుతున్నారని, వైసీపీ పనైపోయినట్టేనని చంద్రబాబు చెప్పినట్లు యనమల వెల్లడించారు.
DETAILS
ప్రభుత్వం అరాచకాలపై పోరాటం ఆపొద్దు : చంద్రబాబు
తొలుత జైల్లో బాబును చూసి ఎలా ఉన్నారని అడిగానని, బాగానే ఉన్నట్లు చంద్రబాబు చెప్పినట్లు యనమల స్పష్టం చేశారు.
టీడీపీ శ్రేణులను, నాయకులను వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు బాధగా అనిపిస్తున్నట్లు చంద్రబాబు ఆవేదన చెందారన్నారు.
రాష్ట్ర కోసం, ప్రజల కోసం తాను ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోగలనని చెప్పారనన్నారు. ప్రభుత్వం అరాచకాలపై పోరాటం ఆపొద్దని సూచించారన్నారు. ఈ మేరకు తెలుగుదేశం శ్రేణులకు పార్టీ అండగా నిలవాలన్నారు.
జైలు సదుపాయాల కల్పనపై అడిగానని, ఏసీ లేమితో పాటు విపరీతమైన దోమలున్నాయన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలనని చెప్పారన్నారు.
పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా సీనియర్లు బాధ్యత తీసుకోవాలని అధినేత చెప్పారన్నారు. భువనేశ్వరి,బ్రాహ్మణిలతో 20 నిమిషాలు విడిగా చంద్రబాబు సమావేశమయ్యారు.