రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు
రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భిల్వారా జిల్లా పరిధిలోని కోత్రి గ్రామంలో రాత్రి 10 గంటలకు ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. అంతటితో ఆగకుండా బాలికను బొగ్గుల కొలిమిలో అగ్నికి ఆహుతి చేశారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ కిషోరిలాల్, కోత్రి సీఐ శ్యాంసుందర్ 4 ఠాణాలోని పోలీసులు రాత్రే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రంలో దుమారం రేగుతోంది. ఇప్పటికే ఈ ఘోరంపై స్థానికులు భగ్గుమంటున్నారు. అటు రాజకీయంగానూ ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా ఖండించింది. బుధవారం ఉదయం సదరు బాలిక పశువులను మేపాలని ఇంటి నుంచి పొలానికి వెళ్లిందని బాధిత బంధువులు వెల్లడించారు.
ఘటన స్థలిలో కిందపడి ఉన్న బాలిక వెండి కంకణాలు, బూట్లు
సాయంత్రం 4 గంటల సమయం దాటినా ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే బాలిక కోసం గ్రామస్థులతో కలిసి కుటుంబ సభ్యులు గాలించారు. రాత్రి 10 గంటలకు గ్రామానికి బయట ఉన్న ఓ ఇటుకల బట్టిలో బొగ్గు కొలిమి కాలిపోతున్న విషయాన్ని గమనించారు. అనుమానంతో సమీపంలోకి వెళ్లి చూడగా బాలిక పొయ్యిలో కాలుతున్న దారుణ సంఘటన చూసి హతాశులయ్యారు. బాలిను తొలుత గ్యాంగ్ రేప్ చేసి అనంతరం బొగ్గు కొలిమిలో పడేసినట్లుగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలిలో బాలిక వెండి కంకణాలు, బూట్లు బొగ్గు కొలిమికి సమీపంలో కిందపడి ఉన్నాయి. ఉదయం నుంచి కొలిమి వద్ద భారీగా జనం గుమిగూడారు.ఫారెన్సిక్ బృందాన్ని పోలీసులు రప్పించగా ఆధారాలు సేకరించారు.