తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో రూ. 6100కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు. తెలంగాణ చరిత్రను మోదీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కొత్తదే కావొచ్చని కానీ, దేశ చరిత్రలో తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంతం పాత్ర చాలా గొప్పదన్నారు. ఈ రోజు భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో తెలంగాణ ప్రజలు కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచం ముందుకు వస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజలకు అనంతమైన అవకాశాలు ఉన్నాయన్నని మోదీ వెల్లడించారు. అమృత్ కాల్‌లోని ప్రతి సెకనును అందరం ఉపయోగించుకోవాలన్నారు.
కేంద్ర పథకాలతో పేదలకు లబ్ధి: మోదీ
తెలంగాణకు టెక్స్‌టైల్ పార్క్ మంజూరు చేసినట్లు మోదీ పేర్కొన్నారు. దీని ద్వారా పత్తి రైతులకు మేలు జరుగుతుందన్నారు. కొన్ని పార్టీలు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. పేదలందరికీ ఉచిత రేషన్ ఇస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా పేదలందరూ కేంద్ర పథకాలతో లబ్ధి పొందుతున్నారని మోదీ పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు ఎమ్మెస్పీ ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు వరి సేకరణ కోసం కేంద్రం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుల రుణమాఫీ హామీలు ఇంకా పూర్తి కాలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్రామ పంచాయతీలు అసంతృప్తిగా ఉన్నాయని మోదీ అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ విఫలం: మోదీ
కేంద్రం నేరుగా పంచాయతీలకు రూ.12 వేల కోట్లు ఇచ్చిందన్నారు. కేసీఆర్ సర్కార్ పంచాయతీలకు అడ్డంకులు సృష్టించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పంచాయతీలు నిర్ణయించుకున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యువత, అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని మోదీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందన్నారు. ఇక్కడి యువత అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన రాజ్యమేలుతుందని ప్రధాని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు అవినీతిపై ఆధారపడుతున్నాయన్నారు. కాంగ్రెస్ అవినీతిని భారతదేశం మొత్తం చూసిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.