
#NewsBytesExplainer: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీ.. అజెండాలో కీలక అంశాలు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా నదుల జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాల అంశాలపై చర్చించనున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రకటించిన నేపథ్యంలో, నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన వేళ, ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరైన ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారన్న అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌తో రాజీపడి తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలకు బీఆర్‌ఎస్ ద్రోహం
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా పోరాడుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో రాజీపడి తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలకు తీవ్రంగా ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. పెద్ద మొత్తంలో నీటి మళ్లింపు,ఇంజనీరింగ్ లోపాలు,ఆర్థిక దుర్వినియోగానికి వీలు కల్పించిందని విమర్శలు గుప్పించారు. 2014 నుంచి 2023 వరకూ పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కును కాపాడడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
వివరాలు
పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించిన ఆంధ్రప్రదేశ్
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్‌ఎల్‌ఐఎస్) నిర్మాణం కారణంగా 2004-05 నుంచి 2014 వరకు, అలాగే 2014-15 నుంచి 2023-24 మధ్యకాలంలో మొత్తం 1,192.44 టీఎంసీల కృష్ణా నదీ జలాలను బహిరంగ బేసిన్ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైల జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి నిల్వ సామర్థ్యాన్ని రోజుకు 11 టీఎంసీల వరకు పెంచారని ఆయన వివరించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి లేకుండానే, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ఈ పనులను చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.
వివరాలు
బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేదా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో అభ్యంతరాలు తెలపడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని...ఈ కారణంగా తెలంగాణకు రావాల్సిన వాటా దెబ్బతిన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ బుధవారం(జూలై 16) న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి బనకచర్ల అంశాన్ని ఎజెండాలో చేర్చడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని, వెంటనే ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం నాడు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
వివరాలు
కేంద్రానికి స్పష్టమైన లేఖ పంపిన తెలంగాణ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది. కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్లపై చర్చించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సింగిల్ ఎజెండా పంపించగా... దీనిపై స్పందించిన తెలంగాణ కేంద్రానికి స్పష్టమైన లేఖను పంపింది. ఇప్పటికే కృష్ణా నదిపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతుల అంశం, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడంపై చర్చించాలన్న అంశాలతో కూడిన ఎజెండాను తెలంగాణ ప్రభుత్వం పంపినట్టు సమాచారం.
వివరాలు
బనకచర్ల అంశంపై చర్చ జరుగుతుందా లేదా..
బనకచర్లపై గ్రంభీ (GRMB), సీడబ్ల్యూసీ (CWC), ఈఏసీ (EAC) వంటి సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. ఇప్పటి వరకు బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం లేఖలో వివరంగా వివరించింది. తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో... ఇవాళ జరిగే కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరుగుతుందా లేదా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. చర్చ జరిగితే, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వాదనలు ఉంచనుందన్న అంశంపై కేంద్రంతో పాటు జలవనరుల రంగంలోని నిపుణుల దృష్టి నిలిచింది.