Telangana Election: ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఎస్ రిపోర్టు.. సాయంత్రానికి హైదరాబాద్ నూతన సీపీ ఖరారు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విదంగా ఒకేసారి 20 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ ఆనంద్‌పై వేటు పడింది. అయితే ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన ప్యానల్ లిస్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికి ఈసీ పంపారు. ఈ ముగ్గరిలో ఒకరిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎంపిక చేస్తారా? లేక మరికొన్ని పేర్లు పంపాలని ఈసీ కోరుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సందీప్ శాండిల్య, వీవీ శ్రీనివాస్ రావ్, శికా గోయల్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ భగవత్, శివధర్‌రెడ్డి, సజ్జనార్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
వరంగల్, నిజామాబాద్ కమిషనర్ పోస్టులకు ఐజీ ర్యాంకు అధికారుల పేర్లు ప్రతిపాదన
వీరిలో ముగ్గురి పేర్లను ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేసి ఈసీకి పంపింది . ఇక వరంగల్, నిజామాబాద్ కమిషనర్ పోస్టులకు ఐజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపినట్లు తెలిసింది. ఇవాళ సాయంత్రానికి కొత్త సీపీ పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. సందీప్ శాండిల్యకు సౌత్ జోన్ డీసీపీ, సైబరాబాద్ సీపీ, రైల్వేస్ డీజీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఏడీజీ ఆపరేషన్స్ హోదాలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పోలీసుల శాఖలో కలవరం రేపింది. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ తీరు, తెలంగాణ పోలీసుల్లో హాట్ టాపిక్‌గా మారింది.