yadagirigutta: ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్ట: రేవంత్ రెడ్డి
ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి పేరు స్థానంలో యాదగిరిగుట్టను ఉపయోగించాలనే ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ బోర్డు ఏర్పాటుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని, టీటీడీ స్థాయిలో ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం
గోసంరక్షణ కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని, అవసరమైతే టెక్నాలజీని కూడా వినియోగించుకోవాలని సూచించారు. భక్తులకు కొండపై నిద్రించి మొక్కులు తీర్చుకునే సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని, బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన నిధులను మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఆలయానికి సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. పూర్తి వివరాలు, ప్రతిపాదనలు మరొక వారం రోజుల్లో సమర్పించాలని అధికారులను కోరారు.