Telangana: భారీ వర్షాలు,వరదలకు తెలంగాణలో రూ.5వేల కోట్ల నష్టం: రేవంత్
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కేవలం రెండు రోజుల్లోనే వేల కోట్ల రూపాయల పంటలు నీట మునిగాయని, భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే నష్టాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని ముంపు ప్రాంతాల ప్రజలకు సాయం చేయడంపైనే దృష్టి పెట్టింది. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాక మిగతా నష్టాలపై మరింత సమాచారం సేకరించనున్నారు.
మరణాలు, పునరావాసం
ప్రభుత్వం లెక్కల ప్రకారం, ఈ వర్షాల కారణంగా దాదాపు 20 మంది మరణించారని, ఐదు వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. ఇంకా పలు ప్రాంతాలు వరద నీటిలో ఉండటంతో, పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంట నష్టం కూడా భారీ స్థాయిలో జరిగినట్టు ప్రభుత్వం ప్రకటించింది, దాదాపు ఆరువేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా.
విధ్వంసం
మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ప్రభావం చూపించాయి. రోడ్లు పాడైపోయాయి, పంట పొలాలు నదుల్లా మారిపోయాయి, ఇళ్లు నీట మునిగాయి. ప్రభుత్వ నివేదికల ప్రకారం, నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పునరావాస కార్యక్రమాలు పూర్తయ్యాక ప్రభుత్వం దెబ్బతిన్న ప్రాంతాల్లో సర్వే చేసి పూర్తి నష్టాన్ని అంచనా వేయనుంది. ఆస్తి నష్టాలు: వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు, ట్రాన్స్‌కో వంటి ప్రభుత్వ ఆస్తులు, ఆసుపత్రులు, వీధి లైట్లు, డ్రైనేజీలు తదితర సామగ్రి కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి. నష్టం మొత్తం దాదాపు ఆరు వేల కోట్ల వరకూ ఉందని అంచనా వేస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన రహదారులు, రైల్వే ట్రాక్ లు పునరుద్ధరణ
వర్షాలు,వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి,రైల్వే ట్రాక్‌ను పునర్‌నిర్మించే పనులు విస్తృతంగా సాగుతున్నాయి. కేసముద్ర మండలం తాళ్లపూసపల్లి,ఇంటికన్నె వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం వద్ద దెబ్బతిన్నపాలేరు బ్రిడ్జిని మరమ్మతులు చేసి రాకపోకలకు అనుమతిచ్చారు,ఇది గంటల వ్యవధిలోనే పూర్తయ్యింది. అయితే, ఇంకా కొన్ని ప్రాంతాలలో రహదారులు దెబ్బతిని రాకపోకలు అంతరాయంగా మారాయి. కుమరం భీం జిల్లాలో తెలంగాణ-మహారాష్ట్ర నేషనల్ హైవేపై పెనుగంగా నది నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదిలాబాద్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాలలో రాకపోకలు ఆగిపోయాయి.ఈ ప్రాంతాల రహదారులను కూడా తక్షణం పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.