
Telangana Govt: గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ సర్కార్ కొత్త పాలసీ.. 7 లక్షల మందికి రక్షణ!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, ట్రాన్స్‌పోర్ట్, ప్యాకేజింగ్ రంగాల్లో సేవలందిస్తున్న గిగ్ వర్కర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పాలసీని రూపొందించింది.
ఈ పాలసీలో ఉద్యోగ భద్రత, జీతాల హామీ, యాక్సిడెంటల్ బీమా, గిరీవెన్స్ సెల్, పిర్యాదుల పరిష్కారం, సామాజిక భద్రత వంటి అంశాలతో పాటు గిగ్ వర్కర్లపై కంపెనీలు వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకునే అంశాలను కూడా చేర్చారు.
కార్మిక శాఖ లెక్కల ప్రకారం, స్విగ్గీ, జొమాటో, ఓలా,ఉబర్ వంటి సంస్థలతోపాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 లక్షలుగా ఉంది.
Details
రూ.5 లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్సు
భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో గిగ్ వర్కర్లతో భేటీ అయిన రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే 2023 డిసెంబర్ 30న గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్సు అమలులోకి వచ్చింది.
ఆరోగ్యశ్రీ స్కీమ్ వర్తించేలా కార్మిక శాఖ వర్కర్ల వివరాలను సంబంధిత పోర్టల్‌కు అనుసంధానిస్తోంది. తాజాగా తయారైన పాలసీకి న్యాయశాఖ నుంచి క్లియరెన్స్ కోసం ప్రతిపాదనలు పంపించాయి.
Details
బిల్లు రూపంలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
వారం రోజులలో క్లియరెన్స్ వచ్చే అవకాశముండగా, వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజా అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు.
ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పాలసీని బిల్లు రూపంలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.
జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి పాలసీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా, కార్యరూపం దాల్చలేదు.
అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఈ పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా అమలుచేసిన తొలి రాష్ట్రంగా నిలిచే అవకాశముంది.