
Medaram Jathara: మేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు.. జాతర తేదీలు ఎప్పుడంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియాలో అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర వచ్చే ఏడాది 2026లో జరగనుంది.ఇప్పటికే సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవాల తేదీలను అక్కడి పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మేడారం మహా జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టుతోంది. గిరిజన సంక్షేమ శాఖ 150 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమానికి మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు ప్రధానంగా మేడారం జాతర నిర్వహణ,మేడారం ప్రాంతంలో శాశ్వత నిర్మాణాల పనులకు వినియోగించనున్నారు.
వివరాలు
2026 జనవరి 28వ తేదీన ప్రారంభంకానున్న మేడారం
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మేడారం మహా జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 150కోట్ల రూపాయలను కేటాయించిందని పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నఈ గిరిజన పండగ 2026లో జనవరి 28వ తేదీన ప్రారంభమవుతుంది. 28వ తేదీ బుధవారం సారలమ్మ గద్దెకు చేరుతారు.ఆ తర్వాత 29వ తేదీ గురువారం సమ్మక్క గద్దెలపై చేరిక జరుగుతుంది. 30వతేదీ శుక్రవారం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చేల్లిమ్చుకోవచ్చు.చివరగా 31వ తేదీ శనివారం సమ్మక్క,సారలమ్మ,గోవిందరాజు,పగిడిద్దరాజు లు తిరిగి అడవి ప్రవేశం చేస్తారు.