ముడుమాల్ మెన్హిర్స్ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని మెన్హిర్స్ వారసత్వ సంపదకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఈ మేరకు ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల సంస్థతో సంప్రదింపులకు అవసరమైన పత్రాలు, వారసత్వ సంపద పరిరక్షణ కోసం సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది. దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టుతో తెలంగాణ పురావస్తుశాఖకు మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో తెలంగాణ పర్యాటక, పురావస్తు శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆయా ఒప్పంద పత్రాలను ట్రస్టు కార్యదర్శి కె.ప్రభాకర్, ఆచార్య కేపీ రావుకు అందించారు. అయితే 2021 నవంబరు నుంచి అధ్యయనంలో భాగంగా దక్కన్ ట్రస్టు బృందం ఈ ప్రదేశాన్ని ఇప్పటికే పలుమార్లు పరిశీలించింది.
చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఇలా రాయిని నిలబెట్టారు : చరిత్రకారులు
ముడుమాల్ అంటేనే ప్రత్యేకమైన పురావస్తు ప్రదేశం. ఎత్తైన 80 నిలువురాళ్లతో పాటు వేలాది అమరిక రాళ్లు ఉన్న స్థలాన్ని మెన్హిర్స్ అంటారు. దాదాపు 89 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిలువు రాళ్లు విస్తరించాయి. ఒక్కో రాయి దాదాపు 10 నుంచి 14 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. పూర్వకాలంలో పెద్దలు, తమ వారు మరణించాక, ఖననం చేశారని, వారి జ్ఞాపకార్థమే ఇలా రాయిని నిలబెట్టారని కొందరు చరిత్రకారులు అంటున్నారు. ఖగోళ అంశాలతో ఈ నిలువురాళ్లు ముడిపడి ఉన్నట్లు మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దక్షిణాసియాలోనే ఇలాంటి అమరిక ఉన్న అతిపెద్ద ప్రదేశం ఇదే కావడం దీని ప్రత్యేకత.