తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో చారిత్రక వారసత్వం, ప్రకృతి సౌందర్యం మేళవింపుతో అనేక ప్రాంతాలు విజ్ఞాన, విహార కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.
ప్రభుత్వాల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ప్రత్యేక సౌకర్యాలతో రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల నుంచి టూరిస్టులను ఆ ప్రదేశాలు ఆకర్శిస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి టూరిజం మరింత వృద్ధి చెందిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక ప్రదేశాలకు అధునాతన హంగులను జోడించింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకోండి.
తెలంగాణ
రామోజీ ఫిల్మ్ సిటీ
తెలంగాణలో కచ్చితంగా పర్యటించదగ్గ ప్రదేశాల్లో 'రామోజీ ఫిల్మ్ సిటీ' ముందువరుసలో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ ఇది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దీనికి చోటు దక్కింది. వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచే 'రామోజీ ఫిల్మ్ సిటీ' పిల్లలు, పెద్దలతో పాటు అన్ని వయస్కుల వారికి ఇది చక్కటి టూరింగ్ స్పాట్ అని చెప్పాలి.
హైదరాబాద్- విజయవాడ హైవేలో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద 'రామోజీ ఫిల్మ్ సిటీ' ప్రధాన ద్వారం ఉంటుంది.
గోల్కొండ కోట
హైదరాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాల్లో గోల్కొండ కోట ప్రముఖమైనది. కాకతీయల శిల్పకళా నైపుణ్యానికి ఈ కోట దర్పణంగా నిలుస్తుంది. ఒకప్పుడు ఈ కోట వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది.
తెలంగాణ
చార్మినార్
విశ్వనగరం హైదరాబాద్‌కు ఐకానిక్ సింబల్ చార్మినార్. హైదరాబాద్‌కు వచ్చి చార్మినార్‌ను చూడని వారు ఉండరు.
1591లో నిర్మించిన చార్మినార్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.
అంతేకాదు, చార్మినార్‌ను చూడటానికి వచ్చిన వారు ఇక్కడి లాడ్ బజార్ తప్పకుండా షాపింగ్ చేస్తారు. ఇక్కడ లభించే గాజులు చాలా ప్రసిద్ధి.
సాలార్జంగ్ మ్యూజియం
భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియంలలో ఒకటిగా చెప్పుకునే సాలార్జంగ్ మ్యూజియంను సందర్శించకుండా హైదరాబాద్ పర్యటన పూర్తి కాదనే చెప్పాలి.
మూసీ నది ఒడ్డున ఉన్న సాలార్‌జంగ్ మ్యూజియం ఒకప్పుడు హైదరాబాద్ దివాన్ పూర్వీకుల రాజభవనం.
భారతదేశంలో ఉన్న కొన్ని అరుదైన రచనలు, సేకరణలు ఇందులో పొందుపర్చారు.
తెలంగాణ
అనంతగిరి కొండలు
వికారాబాద్ సమీపంలో ఉండే అనంతగిరి కొండలను 'తెలంగాణ ఊటీ'గా కూడా పిలుస్తుటారు. చుట్టూ కొండలు ఉండే ఇది ప్రకృతి అందాలకు నెలవు.
కొండల్లో గడపాలనుకునే సందర్శకులకు ఇది మంచి టూరిస్టు ప్రదేశం అని చెప్పాలి. కొండల మధ్యలో ప్రవహించే నాగసముద్రం సరస్సు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా ట్రెక్కింగ్ చేసేవాళ్లకు ఇది అమితమైన ఆనందాన్ని ఇస్తుంది.
నెహ్రూ జూలాజికల్ పార్క్
హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒకటి. అరుదైన వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తాయి. 1500 కంటే ఎక్కువ జాతులను కలిగి ఉన్న ఈ పార్క్‌లో వన్యప్రాణులను దగ్గరి నుంచి చూసేందుకు సఫారీలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ
వరంగల్‌లో చూడదగ్గ ప్రదేశాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగడుగునా కాకతీయల శిల్పకళా వైభవం ఉట్టిపడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అబ్బురపరిచే రాతి నిర్మాణాలు కాకతీయుల ప్రత్యేకం.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం 'రామప్ప' ప్రస్తుత ములుగు జిల్లా వెంకటాపురంలో ఉంది.
13వ శతాబ్దంలో నిర్మించిన వరంగల్ కోటలో ఒకే రాయితో నిర్మించిన నాలుగు స్తంభాల తోరణం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
వరంగల్ వైపు వెళ్లేవారు తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం లక్నవరం సరస్సు.
1000 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంటుంది. దీన్ని ప్రభుత్వం మంచి టూరిస్ట్ స్పాట్‌గా తయారు చేసింది. వందల సంఖ్యలో లక్నవరం సరస్సును సందర్శించేందుకు టూరిస్టులు వస్తుంటారు.
తెలంగాణ
నాగార్జున సాగర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ బస్ స్టేషన్‌కు 58 కి.మీ దూరంలో నాగార్జునసాగర్ ఉంటుంది.
కృష్ణా నదిపై 407 అడుగుల ఎత్తైన ఆనకట్టను నిర్మించారు. దీని సమీపంలో చారిత్రక ప్రదేశం నాగార్జునకొండ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళితే ఎత్తిపోతల జలపాతాలను కూడా సందర్శించవచ్చు.
కుంతల జలపాతం
రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం కుంతల 'వాటర్ ఫాల్స్'. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
దీనికి సమీపంలోనే పోచెర, గాయత్రి జలపాతాలు కూడా ఉంటాయి. అందుకే అనేక మంది టూరిస్టులు దీన్ని ట్రెక్కింగ్ స్పాట్‌గా ఎంచుకుంటారు.
తెలంగాణ
మెదక్ కోట
మెదక్‌కు సమీపంలోని పోచారం అభయారణ్యం రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ తెలంగాణ పర్యాటక ప్రదేశాలలో ఒకటి.
12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించి కోట ఇప్పటికీ సందర్శకులను ఆకర్శిస్తోంది. ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 'గండభేరుండం' అని పిలువబడే భారీ రెండు తలల ఫిరంగి కూడా ఉంది.
ఖమ్మం ఫోర్టు
తెలంగాణలోనే అత్యంత పురాతనమైన కోటల్లో ఒకటిగా ఖమ్మం ఫోర్టును చెప్పుకుంటారు. ఇది 950ఏడీ కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు.
తెలంగాణ
మల్లెల తీర్థం-మహబూబ్‌నగర్
నల్లమల అడవుల నడిబొడ్డున ఉన్న ఈ జలపాతం ఆహ్లాదకరమైన టూరిస్టు స్పాట్ అని చెప్పాలి. ఇక్కడ 150 ఎత్తు నుంచి నీరు పడుతుంది.
ట్రెక్కర్లు, వన్యప్రాణుల ప్రేమికులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. జలపాతం చుట్టూ ఉన్న సహజ ఉద్యానవనం సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.
నిజామాబాద్ కోట
10వ శతాబ్దానికి చెందిన నిజామాబాద్ కోట టూరిస్ట్ హాట్‌స్పాట్. చత్రపతి శివాజీ నిర్మించిన రఘునాథ దేవాలయం ఇక్కడే ఉంది.
వారాంతపు యాత్రికులకు, అశోక్ సాగర్, అలీ సాగర్ రిజర్వాయర్‌లు ఆహ్లాదాన్ని పంచుతాయి. అంతేకాకుండా ట్రెక్కింగ్ కూడా ఇవి మంచి గమ్యస్థానాలుగా మారాయి.