
ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్ గా రొనాల్డ్ రోస్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రోస్ ను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రోనాల్డ్ రోస్ గతంలో మహానగర పాలికలో జోనల్ కమిషనర్‌గా పని చేశారు. ఖైరతాబాద్ జోన్ సహా హెల్త్ శానిటేషన్ కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు.
రోస్ కు పలు జిల్లాల్లో పాలనాధికారిగానూ పనిచేసిన అనుభవం ఉంది.మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు.
మరోవైపు ఉమ్మడి ఏపీలో సెర్ప్ అడిషనల్ సీఈవోగా, డ్వాక్రా డైరెక్టర్‌గా పని చేశారు. కెరియర్ లో తొలి నాళ్లలో రంపచోడవరం ఐటీడీఏ పీవోగా, నర్సాపురం సబ్ కలెక్టర్‌గా రోనాల్డ్ రోస్ పని చేశారు.
DETAILS
రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్
ప్రస్తుతం బల్దియా కమిషనర్ గా పనిచేస్తున్న లోకేశ్ కుమార్ ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు మేరకే లోకేశ్ కుమార్ ను తెలంగాణ సర్కార్ బదిలీ చేసింది. ఇప్పుడు ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్ కు అప్పజెప్పింది.
ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది.
ఏ శాఖ లేకుండా వెయిటింగ్ లిస్టులో ఉన్న ముషారఫ్ అలీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.