Telangana: వారం రోజుల్లో విడుదల కానున్న డీఎస్సీ ఫలితాలు.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.ప్రాథమిక 'కీ'పై అనేక అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో,ఫైనల్ కీ విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫైనల్ కీ త్వరలోనే అందుబాటులోకి రావచ్చు, ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన ప్రకారం,ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు మరో వారం రోజుల్లో విడుదల కానున్నాయి. అదనంగా,భట్టి విక్రమార్క నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు.ఇప్పటికే 11,062 పోస్టులతో డీఎస్సీ నిర్వహించిన సర్కార్,త్వరలో మరో డీఎస్సీని 6,000 పైగా పోస్టులతో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా,హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కీలక ప్రకటనలు చేశారు. డీఎస్సీ ఫైనల్ కీ వచ్చే కొద్ది రోజుల్లో విడుదల అవుతుందని చెప్పారు.
మెరిట్ జాబితా విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలో 30,000మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు 45,000మంది టీచర్లను బదిలీ చేశామని తెలిపారు. డీఎస్సీ ఫలితాల విడుదల తర్వాత,జిల్లాల వారీగా మెరిట్ జాబితా విడుదల చేసి, ధ్రువపత్రాల పరిశీలన చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్కారు కొత్త టీచర్ల సేవలను వీలైనంత త్వరగా వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో ఒక గడువు కూడా నిర్ణయించుకుని పనిచేస్తోంది.గురువారం డిప్యూటీ సీఎం భట్టి ఫలితాల విడుదలపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, 87.61 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అంటే మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.