పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం వెనుక జలాలతో తెలంగాణలో ముంపు సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే పూర్తయ్యే వరకు నీరు నిల్వ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
గ్రావిటీపై ఏడాదిన్నరలోగా పోలవరం నీటిని రిలీజ్ చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆశలపై తెలంగాణ నీళ్లు చల్లింది.
ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గడ్ లు ఉమ్మడి సర్వే కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేస్తున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణ భూభాగంలో ముంపు సమస్య ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది టీఎస్ సర్కార్.
అందువల్ల ఉమ్మడి సర్వే చేపట్టి ముంపు పరిధిని గుర్తించే వరకు జలాశయంలో నీటిని నిల్వ చేయనివ్వొద్దని వాదిస్తోంది.
Polavaram Back Water Issue
దాదాపు 1000 ఎకరాలు మునిగిపోతాయి: ఈఎన్సీ
జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 150 అడుగులు వద్ద నీటిని నిల్వ చేస్తే, తెలంగాణలో 899 ఎకరాలు ముంపునకు గురవుతోందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖను రాశారు. ఇదే విషయం ఆంధ్ర ప్రభుత్వం కూడా ధృవీకరించిందన్నారు.
గతేడాది జులైలో గోదావరికి వచ్చిన భారీ వరదల సమయంలో పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేశారి, ఫలితంగా బ్యాక్ వాటర్ తో ఇబ్బందులు తలెత్తినట్లు గుర్తు చేశారు.
ప్రాజెక్టులో నీటి నిల్వ లేదని ఏపీ చెబుతున్నప్పటికీ నిల్వకు సంబంధించిన ఆధారాలను పంపుతున్నాట్లు ఈఎన్సీ వివరించారు.
Polavaram Back Water Issue
గ్రావిటీపై నీరివ్వాలని ఏపీ ఆలోచన
తక్షణమే రివర్ క్రాస్ సెక్షన్లు, వరద అంచనా, ముంపు ప్రభావంపై అధ్యయనం చేయించాలని లేఖలో పీపీఏకు కోరారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినా, రెండు కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం అయితే ఇప్పటికే నిర్మితమైంది.
మట్టి కట్ట నిర్మాణానికి వీలుగా అప్పర్ కాఫర్ డ్యామ్‌తో పాటు లోయర్ కాఫర్ డ్యామ్ నిర్మించారు. కాఫర్ డ్యామ్‌లల్లో నీరు నిల్వ చేస్తే వాటి ద్వారా గ్రావిటీపై నీటిని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది.
సుప్రీం ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ టెక్నికల్ కమిటీ సమావేశాలు నిర్వహించి పోలవరం ప్రాజెక్టు సమాచారాన్ని 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
Polavaram Back Water Issue
డ్యామ్ గేట్లు తెరిచే ఉంచాలి
పోలవరం ముంపునకు సంబంధించి తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేయొద్దని 2021లోనే తెలంగాణ సుప్రీంకోర్టును తలుపు తట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే చేపట్టాలని సీడబ్ల్యూసీ, పీపీఏకు సుప్రీం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కేంద్ర జల సంఘం ఆదేశాలు సైతం ఉన్నట్లు ఈఎన్సీ మురళిధర్ తెలిపారు.
ఉన్నఫలంగా వరదలు వస్తే వ్యవసాయ భూములు ముంపునకు గురవడం, ఐటీసీ పరిశ్రమ, మణుగూరు భార జల కర్మాగారం, ఎత్తిపోతల పథకాలు తీవ్ర ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అలా జరగకుండా ఉండాలంటే ఈసారి వర్షాకాలంలో 48 గేట్లు, రివర్ స్లూయీస్ తెరిచే ఉంచేలా చర్యలు తీసుకోవాలని పీపీఏను ఈఎన్సీ కోరగా, టీఎస్ డిమాండ్‌పై ఏపీ సర్కార్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు సమాచారం.