
తెలంగాణలో కొత్తగా 20 కేజీబీవీలకు కేంద్రం పచ్చజెండా.. కొత్త విద్యాలయాల జాబితా ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కొత్తగా కేజీబీవీ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రికరింగ్ బడ్జెట్ పేరిట రూ.60 లక్షల నిధులను విడుదల చేసింది.
మరోవైపు రాష్ట్రంలో ఓవైపు జిల్లాల విభజన, మరోవైపు కొత్త మండలాలను తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు కొత్త మండలాలకు 20 కేజీబీవీ విద్యాలయాలు అవసరమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఆయా కొత్త మండలాలకు కేజీబీవీలను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఈ క్రమంలోనే ఆయా ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది.
DETAILS
తాజాగా 20తో మొత్తం 495కి చేరిన కేజీబీవీలు
నూతనంగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది.
రాష్ట్రం ఏర్పడే నాటికి (2014)లో తెలంగాణలో కేవలం 391 కేజీబీవీలు(KGBV)లు ఉన్నాయి. 2017-18లో 84 కేజీబీవీలను కొత్తగా కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల సంఖ్య 475కి చేరుకున్నాయి.
తాజాగా మరో 20 కేజీబీవీలు మంజూరు కావడంతో తాజాగా వీటి సంఖ్య 495కి పెరిగింది. వీటిలో 245 కేజీబీవీల్లో ఇంటర్, మరో 230 కేజీబీవీల్లో పదో తరగతి వరకు తరగతులను నిర్వహిస్తున్నారు.
DETAILS
ప్రస్తుతం 475 కేజీబీవీల్లో కొనసాగుతున్న తరగతులు
తెలంగాణలో ప్రస్తుతం కేజీబీవీలు - 475
ఇంటర్ కేజీబీవీలు - 245
పదో తరగతి కేజీబీవీలు - 230.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు 20 కేజీబీవీలను(కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యాలయాలు) ఈ కింది ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మావల (ఆదిలాబాద్), బీర్‌పూర్,
బుగ్గారం (జగిత్యాల),
కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్),
దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్(మహబూబ్‌నగర్),
నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్‌పూర్ (మెదక్),
నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్),
నాగిలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్‌పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి),
దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్).