
సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాకు సింగపూర్ తో ప్రత్యేక సంబంధాలున్నాయి.
ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజల ఆహార భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం బియ్యం ఎగుమతికి పచ్చజెండా ఊపింది.
ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. దేశీయ బియ్యం ధరలను స్థిరీకరణ చేసేందుకు జులై 20 నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది.
అనంతరం కొద్ది రోజులకే బాస్మతి బియ్యం ఎగుమతులపైనా కేంద్రం నియంత్రణ విధించింది.
ఈ క్రమంలోనే సింగపూర్ దేశానికి మాత్రం బియ్యం ఎగుమతులపై ఎటువంటి నిషేధాలు లేకుండా బియ్యం ఎగుమతులపై అనుమతులు జారీ చేసింది.
DETAILS
జులై 20న బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధింపు
మరోవైపు భారత్, సింగపూర్ దేశాల సన్నిహిత బంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సంబంధాల నేపథ్యంలో సింగపూర్ కు బియ్యం ఎగుమతిని అనుమతించేందుకు కేంద్రం నిర్ణయించింది.
ఈ మేరకు విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. ఇప్పటికే పలు రకాల బియ్యం ఎగుమతులపై కేంద్ర సర్కార్ పరిమితులు విధించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతులు భారీగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ క్రమంలోనే జులై 20న కేంద్రం బియ్యం ఎగుమతికి సంబంధించిన నిబంధనలను సవరించింది.
ఫలితంగా బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని నిషిద్ధ జోన్లోకి తీసుకొచ్చింది. సింగపూర్ కు మాత్రం ఇందుకు మినహాయింపులు ఇవ్వడం గమనార్హం.