తెలంగాణ: ఆర్టీసీ నుంటి మెట్రో వరకు, క్యాబ్ నుంచి ఆటో వరకు అన్నింటికీ ఒక్కటే కార్డు
తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్నమైన కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. ఏ వాహనంలో ప్రయాణం చేసినా ఇకపై అన్నింటికి కలిపి ఒకే కార్డును వినియోగించుకునే వెసులుబాటును కల్పించేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీ బస్ మొదలు మెట్రో రైలు, ఎంఎంటీఎస్, క్యాబ్ సర్వీస్, ఆటోలు ఇలా ఏ వాహనమెక్కినా ఇకపై ఒకటే కార్డు ఉపయోగించేందుకు కార్యచరణను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి శాఖల అధిపతులతో సమీక్షించారు. సమీక్షలో భాగంగా ఆల్ ఇన్ వన్ కార్డుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ,మెట్రో రైలుకు చెందిన ఉన్నతాధికారులు మంత్రులకు అందించారు. ప్రజలకు కార్డు జారీ మొదలు వినియోగం వరకు అన్నింటిపైనా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.
త్వరలోనే అన్నింటికీ కామన్ మొబిలిటీ కార్డు
ఈ క్రమంలోనే ఆగస్ట్ రెండో వారంలో కామన్ మొబిలిటీ కార్డులను రెడీ చేసేందుకు కసరత్తులు మొదలైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీలు ఇప్పటికే కార్యచరణను ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు, ఆర్టీసీ ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా అత్యధిక మంది ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఆయా ప్రయాణికులకు సంయుక్తంగా ఒకే కార్డును జారీ చేసేందుకు పనులు వేగవంతమవుతున్నాయి. తొలుత ప్రయోగాత్మకంగా హైదరాబాద్ వరకే ఈ కార్డు జారీ ఉంటుందని సమాచారం. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్డు జారీ చేసేలా అధికారులను ఆదేశించారు. మరోవైపు దేశవ్యాప్తంగానూ ఈ కామన్ కార్డు వినియోగం ఉండేలా పరిశీలించాలని మంత్రులు అధికారులకు సూచించారు.