LOADING...
Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి షాక్.. రివిజన్ పిటిషన్ కొట్టివేత
రివిజన్ పిటిషన్ కొట్టివేత

Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి షాక్.. రివిజన్ పిటిషన్ కొట్టివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ తగిలింది. ఓబుళాపురం అక్రమ ఖనిజ పరిశ్రమ (మైనింగ్) కేసులో తనను నిర్దోషిగా విడుదల చేయాలంటూ ఆమె హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం,దానిని కొట్టివేసింది. ఓఎంసీ (ఓబుళాపురం మైనింగ్ కంపెనీ) కేసులో ఆమెను ఇప్పటికే న్యాయస్థానం నిందితురాలిగా పేర్కొంది. కోర్టు తాజా తీర్పుతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ జరపనుంది.

వివరాలు 

అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ

ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి వేసిన డిశ్ఛార్జ్ పిటిషన్‌ను 2022 అక్టోబర్‌లో సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. అప్పట్లో హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారించి ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కేసు నుంచి ఆమెను విముక్తురాలిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ కేసును తిరిగి హైకోర్టుకు పంపిస్తూ, మూడు నెలల లోపు విచారణ పూర్తిచేయాలని ఆదేశించింది.

వివరాలు 

శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ తిరస్కరణ 

శ్రీలక్ష్మి 2006లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఓఎంసీకి మైనింగ్ లీజుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైందని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. లీజుల మంజూరులో ఆమె అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డారని,ప్రాధాన్యతల్ని పట్టించుకోకుండా అవకతవకలకు తావిచ్చారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి,గతంలో దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడిన విషయాన్ని ప్రస్తావించకుండా మళ్లీ అదే కేసులో పిటిషన్ వేశారని హైకోర్టుకు సీబీఐ నివేదికలో పేర్కొంది. ఓఎంసీకి లీజుల మంజూరులో ఆమె వైఖరికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని,కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని సీబీఐ వాదించింది. ఈ వాదనలను సమగ్రంగా పరిశీలించిన హైకోర్టు, శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పుతో ఆమెకు మరోసారి చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలినట్లయింది.