బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే
హైదరాబాద్ మహానగర శివారు(వెస్ట్ సిటీ) ప్రాంతం బుద్వేల్ లో భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. బుద్వేల్ భూములను హెచ్ఎండీఏ వేలం వేస్తోంది. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని సవాల్ చేస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. బార్ అసోసియేషన్ లో భేదాభిప్రాయాలున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయవాదులంతా ఏకాభిప్రాయంతో వస్తేనే వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.
బుద్వేల్ లో కొనసాగుతున్న భూముల వేలం.. ఎకరం కనీస ధరగా రూ.20 కోట్లు
బుద్వేల్ లో 100 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆయా స్థలాలను హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలని 2012 నుంచి కోరుతున్నట్లు హైకోర్టు బార్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు భూముల వేలాన్ని సవాల్ చేస్తూ పిల్(PIL) వేసింది. ఆయా భూములను హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ(HMDA) నిర్వహిస్తున్న వేలం పాటను ఆపేందుకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు హైకోర్టు అనుమతితో బుద్వేల్ భూముల ఈ వేలం ప్రక్రియ కొనసాగుతోంది.ఎకరం రూ. 25 కోట్ల పలికి రికార్డు సృష్టిస్తోంది. 5వ నెంబర్ ప్లాట్ అత్యధికంగా రూ. 31.25 కోట్లు పలికింది. ప్రభుత్వం కనీస వేలం ధరను రూ. 20 కోట్లుగా ప్రకటించింది.