తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్
సర్కారు పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోషకమైన రాగి జావతో అల్పాహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థుల డైట్ మెనూలో బెల్లం కలిపి తయారు చేసిన రాగి జావను చేర్చేందుకు అన్వేషిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే రాగి, శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, మినరల్స్ అందించడమే కాకుండా ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అమలు
కొందరు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయాన్నే కూలి లేదా వ్యవసాయ పనులకు బయలుదేరడంతో వారు అల్పాహారం తినలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఖాళీ కడుపుతో విద్యార్థులు చదవుపై దృష్టి సారించలేరని గ్రహించిన ప్రభుత్వం ఈ పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే తమ విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించడం ప్రారంభించాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని పాఠశాలల పనిదినాలలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తుండగా, రాగి జావ విద్యార్థులకు వరం కానుంది. మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్స్‌ను చేర్చే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైస్కూల్ విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు సార్లు మిల్లెట్స్ అందించే అవకాశం ఉంది.