Page Loader
#NewsBytesExplainer: స్వపక్షాల్లో విపక్షాలు.. తెలంగాణ రాజకీయాల్లో సాగుతున్న అంతర్గత పోరాటాలు 
స్వపక్షాల్లో విపక్షాలు.. తెలంగాణ రాజకీయాల్లో సాగుతున్న అంతర్గత పోరాటాలు

#NewsBytesExplainer: స్వపక్షాల్లో విపక్షాలు.. తెలంగాణ రాజకీయాల్లో సాగుతున్న అంతర్గత పోరాటాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా ఏ రాజకీయ వ్యవస్థలో అయినా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. కానీ.. తెలంగాణ రాజకీయాల్లో మరో స్పెషల్‌ కూడా ఉంది.అదే స్వపక్షంలో విపక్షం. పార్టీ అంతర్గతంగా అధికారం కోసం జరిగే పోరాటాలు బయటకు దర్శనమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలతోనే కాకుండా,తమ పార్టీల్లోనే తలెత్తిన ఈ అంతర్గత సమస్యలు నాయకత్వాలను చికాకు పరిచే స్థితికి తీసుకువెళ్తున్నాయి. ఈ పరిణామాలు తాడోపేడో తేల్చుకునే స్థాయికి చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో పార్టీ ఫోరమ్‌ సమావేశాల్లో లేదా నాయకుల మధ్య పరస్పర చర్చలకే పరిమితమైన అధికార పోరాటాలు.. ఇప్పుడు రోడ్డుమీదికి వచ్చి పోటీపడుతున్నాయి.

వివరాలు 

పెద్ద చర్చగా మారిన అంతర్గత పోరాటాలు

ఒకరిపై మరొకరు ఎత్తులు వేస్తూ, తమ బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి పదవిలో పదేళ్లు కొనసాగుతానని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టి హాట్ టాపిక్ అయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్‌లో కల్వకుంట్ల కవిత వ్యవహారం కొనసాగుతుండగా, బీజేపీలో బండి సంజయ్-ఈటల రాజేందర్‌ల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత పోరు బయటపడింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంతర్గత పోరాటాలు పెద్ద చర్చగా మారాయి.

వివరాలు 

రేవంత్ కు షాకిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి,స్వేచ్ఛకు ప్రాధాన్యత ఉందని ఎప్పుడూ చెప్పుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇవే పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. జూలై 18న నాగర్‌కర్నూల్ జిల్లా జడ్చర్లలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను వచ్చే పదేళ్ల పాటు సీఎం గానే కొనసాగుతానని చేసిన ప్రకటన పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల తర్వాత సీనియర్ నాయకులు చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నించినా,అధిష్ఠానం చివరికి రేవంత్ రెడ్డికే ఆ పదవిని అప్పగించింది.అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని తెలిసినప్పటికీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

వివరాలు 

రేవంత్ కు షాకిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను తన వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చేందుకు చూస్తున్నాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.ఈ వ్యాఖ్యలు పార్టీ నేతల మధ్య చర్చకు దారి తీశాయి. క్యాబినెట్‌లో చోటు దక్కకపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు చోటు ఇవ్వలేకపోయినట్టు పార్టీ స్పష్టం చేసినా, ఇది ఆయన అసంతృప్తిని తగ్గించలేదు. క్యాబినెట్ విస్తరణ అనంతరం రెండుమూడు రోజుల్లోనే రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పదవి దక్కకపోయినా కార్యకర్తగా పనిచేస్తానని అప్పట్లో ప్రకటించినా,తాజాగా సీఎం రేవంత్‌ను నేరుగా టార్గెట్ చేయడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీ అంతర్గతంగా పెద్ద మార్పులు జరగబోతున్నాయన్న సంకేతాల్ని ఆయన ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

బీజేపీలో బండితో ఢీ అంటే ఢీ అంటున్న ఈటల 

తెలంగాణ బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య అంతర్గత పోరు బయటపడింది. ఒకే పార్టీలో ఉండి కూడా వీరి మధ్య అసహనం పెరిగిపోయింది. బీజేపీలో పట్టుకోసం ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ బీసీ వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే. బండి సంజయ్ బీజేపీలో విద్యార్థి దశ నుంచే ఉన్నారు. కానీ ఈటల రాజేందర్ విద్యార్థి దశలో లెఫ్ట్ పార్టీలతో అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌లో చేరి కీలక స్థానానికి ఎదిగిన ఆయన, అనంతరం కేసీఆర్‌తో మనస్పర్థల వల్ల బీఆర్ఎస్ విడిచి బీజేపీలో చేరారు.

వివరాలు 

బీజేపీలో బండితో ఢీ అంటే ఢీ అంటున్న ఈటల 

బీజేపీలో కేంద్ర నాయకత్వంతో ఈటలకు మంచి సంబంధాలు ఉన్నా, రాష్ట్రంలోని కొందరు నేతలతో విభేదాలు పెరిగాయని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బండిసంజయ్‌తో ఆయనకు గ్యాప్ పెరిగినట్లు పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. వీరిద్దరిని కలిపి పని చేయించాలని గతంలోనే అమిత్ షా సూచించినట్లు సమాచారం. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన తర్వాత ఈటల హుజూరాబాద్‌కు దూరమయ్యారు.కానీ బండి సంజయ్ హుజూరాబాద్‌లో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈటల అనుచరులకు బండి సంజయ్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా ఈటల ఇటీవల తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి,కేంద్ర మంత్రి పదవులు దక్కకపోవడం,పార్టీ సంస్థాగత ఎన్నికల్లో తన అనుచరులకు ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన అసంతృప్తి తారాస్థాయికి చేరింది.

వివరాలు 

బీఆర్ఎస్‌లో కవిత 

తాడోపేడో తేల్చుకోవాలని ఈటల నిశ్చయించుకున్నారని ఆయన మాటల ఆధారంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణపై కేసీఆర్‌కు కవిత ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ లేఖ బయటపడటం, ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం తర్వాత ఈ వివాదం పెరిగింది. ఈ లీక్‌పై కవిత అనుమానాలు వ్యక్తం చేస్తూ, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కేటీఆర్‌ను విమర్శించినట్లుగా భావిస్తున్నారు. కవిత పార్టీ కార్యక్రమాలను పక్కనపెట్టి తెలంగాణ జాగృతి ద్వారా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గతంలో కవితకు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దూరంగా ఉండటం గమనార్హం.

వివరాలు 

బీఆర్ఎస్‌లో కవిత 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కవిత స్వాగతించినా, పార్టీ మాత్రం దీనిని తప్పుబట్టింది. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కవితపై స్పందించాల్సిన సందర్భంలో బీఆర్ఎస్ మౌనమే పాటించటం గమనార్హం. కేసీఆర్, కేటీఆర్ సహా ఎవ్వరూ స్పందించకపోవడం గ్యాప్‌ను స్పష్టం చేస్తోంది. సింగరేణి బాధ్యతల నుంచి కవితను తప్పించడం ఆమె ప్రాధాన్యం తగ్గిన తొలి బహిరంగ చర్యగా పేర్కొంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, తెలంగాణ జాగృతిని వేదికగా చేసుకుని రాజకీయ పార్టీ తరహాలో కార్యకలాపాలు నిర్వహించడం పార్టీకి ఇబ్బందిగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.