Polavaram: పోలవరం బ్యాక్ వాటర్ పై ఉమ్మడి సర్వే.. వేగం పెంచాలన్న కేంద్ర జల సంఘం
పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ ఏర్పడినపుడు తెలంగాణపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకోవడం, ఆ ప్రభావం ఎంత మేరకు వ్యాపిస్తుందో గుర్తించడం కోసం చేపట్టిన సంయుక్త సర్వేను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచించింది. తెలంగాణ, పీపీఏలతో సమన్వయంతో ఈ పనిని పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ అంగీకరించగా, నిర్ణీత కాలపరిమితి లోగా జరగడం కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లతో గత రెండేళ్లుగా కేంద్ర జలసంఘం సంప్రదింపులు జరుపుతోంది.
సమావేశం మినిట్స్‌ను విడుదల చేసిన కేంద్ర జలసంఘం
ఆగస్టు 28న సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఓహ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాలుగు రాష్ట్రాల అధికారులు, పీపీఏ, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం మినిట్స్‌ను కేంద్ర జలసంఘం విడుదల చేసింది. ఒరిస్సా సర్వేలో గరిష్ట వరద ప్రవాహాన్ని (పీఎంఎఫ్) పరిగణనలోకి తీసుకోవాలని చేసిన సూచనను తిరస్కరించింది. 2022లో భద్రాచలం వద్ద వచ్చిన వరద, 2011లో గోపాలకృష్ణన్ కమిటీ అందించిన అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు తెలిపింది. పోలవరంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణలో ముంపు ఉంటుందని, డ్రెయినేజీ వ్యవస్థ సమస్యాత్మకంగా మారుతుందని తెలంగాణ పేర్కొంది.
కిన్నెరసాని, మణుగూరు వాగులపై సంయుక్త సర్వే
2022 జులైలో వచ్చిన వరదను పరిగణనలోకి తీసుకొని తాజాగా బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌ను, భద్రాచలం ఆలయాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ అభ్యర్థించింది. కిన్నెరసాని, మణుగూరు వాగులపై సంయుక్త సర్వే జరిపి సీడబ్ల్యూసీ నివేదిక పంపించినప్పటికీ, మార్కింగ్ పూర్తి కాకపోవడంతో సమస్యలు ఏర్పడాయని తెలంగాణ గుర్తు చేసింది. సర్వే ప్రకారం డీమార్కేషన్‌కు తెలంగాణను సంప్రదించగా అంగీకరించలేదని, ఇది పూర్తి కాకముందే ఇతర వాగులపై కూడా సర్వే చేయాలనడంతో ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది.