
Milan Festival: 'మిలాన్ ఫెస్టివల్'కు తెలంగాణ చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'మిలాన్ ఫెస్టివల్'లో పాల్గొనడానికి తెలంగాణకు చెందిన చేనేత కళాకారుడు జి. విజయ్ రాజేంద్ర వర్మ ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కుమార్ ఈ విషయాన్ని బుధవారం తెలియజేశారు. ఈ అంతర్జాతీయ స్థాయి మేళా ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి 14 వరకు ఇటలీలో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేడుకలో తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా అవకాశం రావడం గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. 2025-26 సంవత్సరానికి గాను జాతీయ చేనేత అభివృద్ధి పథకంలో భాగంగా మిలాన్ ఫెస్టివల్‌కు పాల్గొనడానికి రాష్ట్రం నుంచి ఐదుగురు అభ్యర్థుల పేర్లను చేనేత సేవా కేంద్రం కేంద్రానికి పంపిందని తెలిపారు.
వివరాలు
గద్వాల, కొత్తకోట ప్రాంతాల్లో 250 మగ్గాలపై చీర
వారిలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జి. విజయ్ ఎంపికైనట్లు తెలిపారు. విజయ్ గతంలో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేవారని, తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో గద్వాలలో నివాసం ఏర్పర్చుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయన గద్వాల, కొత్తకోట ప్రాంతాల్లో 250 మగ్గాలపై చీరలు నేయిస్తూ అనేక చేనేత కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ మిలాన్ ఫెస్టివల్‌కి కేవలం ఐదుగురు కళాకారులను మాత్రమే ఎంపిక చేయగా, వారిలో ఒకరిగా తెలంగాణకు చెందిన విజయ్ ఎంపికవడం రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని డైరెక్టర్ తెలిపారు.